దేశంలో పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులు.. జూలైలో ఏకంగా 600 కోట్లకుపైగా యూపీఐ లావాదేవీలు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



దేశంలో డిజిటల్ పేమెంట్ వేగంగా వృద్ధి చెందుతోంది. గడిచిన నెల జులైలో యూపీఐ రూపంలో లావాదేవీలు ఏకంగా 600 కోట్లకుపైగా నమోదయ్యాయి. 2019లో దేశంలో ఆన్‌లైన్‌ లావాదేవీలు జరిపిన వారి సంఖ్య 23 కోట్లు. దేశవ్యాప్తంగా 69.2 కోట్ల మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల నుంచి 35.1 కోట్లు, పట్టణ ప్రాంతాల నుంచి 34.1 కోట్ల మంది ఉన్నారు. కరోనా మహమ్మారి కాలంలో ఈ సంఖ్య 51 శాతం పెరగడం గమనార్హం. ఇంటర్నెట్‌ వినియోగం పరంగా సామాజిక మాధ్యమాలు, వినోదం, సమాచార కార్యకలాపాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. గ్రామీణ భారతదేశంలో ఓటీటీ వేదికల వినియోగం పట్టణ భారత్‌తో సమానంగా ఉంది.

యూపీఐ పేమెంట్ల సంఖ్యతోపాటు వాటి విలువ కూడా క్రమంగా పురోగమిస్తోంది. ఆర్థిక సంవత్సరం 2022లో 46 బిలియన్లకుపైగా లావాదేవీలు నమోదవ్వగా వీటి విలువ ఏకంగా రూ.84.17 లక్షల కోట్లకుపైగా ఉందని రికార్డులు చెబుతున్నాయి. అంటే చెల్లింపుల విలువ దాదాపు 1 ట్రిలియన్ డాలర్లు దాటింది. ఇక అంతకుముందు సంవత్సరం 22.28 బిలియన్ల లావాదేవీలు జరగగా వీటి విలవ రూ.41.0. లక్షల కోట్లుగా రికార్డయ్యాయి. దేశంలో పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులకు ఈ గణాంకాలు ఉదాహరణగా ఉన్నాయి.

వెబ్ స్టోరీస్