Disney Layoffs | మరో కంపెనీ లేఆఫ్స్.. 7 వేల మంది ఉద్యోగులను గెంటేస్తున్న డిస్నీ

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



|| ప్రతీకాత్మక చిత్రం Photo: Twitter ||

ఈవార్తలు, బిజినెస్: గూగుల్.. అమెజాన్.. మైక్రోసాఫ్ట్.. ట్విట్టర్.. మెటా.. ఇలా ప్రతి కంపెనీ ఉద్యోగులను కంపెనీల్లోంచి గెంటేశాయి. ఇప్పుడు ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ వాల్డ్ డిస్నీ కూడా ఉద్యోగులకు గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఖర్చులను తగ్గించుకునేందుకు తమ కంపెనీ నుంచి 7 వేల మందికి స్వస్తి పలికేందుకు డిస్నీ రెడీ అవుతోంది. 5.5 బిలియన్ డాలర్ల ఖర్చులను ఆదా చేయడానికి, స్ట్రీమింగ్ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడానికి తమ కంపెనీలోని 7 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ సీఈవో బాబ్‌ ఇగర్‌ తెలిపారు. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 3.6 శాతం అని వివరించారు. కంపెనీలో మొత్తం 2.20 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇటీవల డిస్నీకి సబ్‌స్క్రైబర్లు చాలావరకు తగ్గిపోయారు. గత మూడు నెలల్లో డిస్నీ+కు ఒక శాతం వినియోగదారులు తగ్గారు. అటు.. నష్టాలు పెరిగిపోవడంతో ఇప్పటికే కొత్త నియామకాలను ఆపేసింది. బిజినెస్‌ ట్రావెల్స్‌ను తగ్గించింది. పర్యటనల విషయంలో తప్పనిసరిగా తమ ఆమోదం పొందాలని కంపెనీ యాజమాన్యం ఉన్నతోద్యోగులకు స్పష్టం చేసింది.

అటు, ప్రముఖ వీడియో కాలింగ్ యాప్ జూమ్ కూడా ఉద్యోగులను తొలగిస్తోంది. సంస్థలోని 15 శాతం మందిని అంటే.. 1,300 మందిని ఇంటికి పంపుతోంది. ఈ మేరకు కంపెనీ సీఈవో ఎరిక్ యువాన్ తెలిపారు. ఉద్యోగం కోల్పోతున్నవారికి 16 వారాల జీతం, హెల్త్ కేర్ సదుపాయం, 2023 ఆర్థిక సంవత్సరానికి ప్రతిభ ఆధారంగా బోనస్, 6 నెలల పాటు స్టాక్ ఆప్షన్‌ పై అధికారం ఇస్తున్నామని పేర్కొన్నారు.


వెబ్ స్టోరీస్