బెల్లంపల్లిలో షాదీఖానా స్థలాన్ని మింగేస్తున్నారు.. అయినా అధికారుల పట్టింపేది?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ఆక్రమణకు గురైన షాదీఖానా స్థలం||

ఈవార్తలు, బెల్లంపల్లి: ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా.. అది ప్రభుత్వానిదైనా! ప్రైవేట్ వ్యక్తులదైనా! దొరికిందే చాన్స్.. అడ్డెవరు? అడిగేదెవరు? ఇదీ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భూ ఆక్రమణల పరిస్థితి. ఖాళీ స్థలం కనిపిస్తే ఆక్రమించేస్తాం అన్న రీతిలో భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ఏకంగా షాదీఖానా భూములకే ఎసరు పెట్టేశారు కబ్జా రాయుళ్లు. పట్టణంలోని షంషీర్ నగర్‌లో ముస్లిం వర్గానికి కేటాయించిన షాదీఖానా స్థలాన్ని ఎక్కడికక్కడ కబ్జా చేస్తున్నా అధికారుల్లో చలనం లేకపోయింది. దొంగ రెవెన్యూ పత్రాలు సృష్టించి కోర్టులను తప్పుదారి పట్టించే స్థాయికి చేరారు కబ్జాకోరులు. ప్రభుత్వం తమ కోసం కేటాయించిన షాదీఖానా భూమి కబ్జాకోరల్లో చిక్కుకుపోయిందని, దయచేసి కాపాడాలని ఎంత వేడుకున్నా అధికారులు పట్టించుకోవటం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

భూకబ్జాదారుల నుంచి తమ షాదీఖానాను కాపాడాలని ఇటీవలే బెల్లంపల్లి డిప్యూటీ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్‌కు స్థానిక ముస్లిం కమ్యూనిటీ ప్రజలు వినతి పత్రం అందజేశారు. అయినా, ఇప్పటికీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారో తెలియడం లేదు. కబ్జా చేసిన వాళ్లు దర్జాగా అక్కడ ఇల్లు కట్టేస్తుంటే.. అధికారులు తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తుంటే ప్రభుత్వం, అధికారులు ఏం చేస్తున్నట్లు? అని నిలదీస్తున్నారు. షాదీఖానా స్థలాన్ని రక్షించాలని ఇప్పటికే ఎంతోమంది అధికారులకు వినతులు ఇచ్చామని, అయినా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి షాదీఖానా స్థలాన్ని కాపాడాలని కోరుతున్నారు. అలసత్వం వహించిన కింది స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు.

షాదీఖానా స్థలాన్ని కాపాడాలి

ప్రభుత్వం షాదీఖానా కోసం స్థలం కేటాయించి, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. అయితే, ఆ భూమి కబ్జాకు గురవుతోంది. ఇప్పటికే బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నిర్మాణం కోసం రూ.50 లక్షలు మంజూరు చేశారు. పనుల ప్రారంభానికి కూడా హామీ ఇచ్చారు. అయితే, షాదీఖానా ఖాళీ స్థలాన్ని కొందరు కబ్జా చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేశాం. వీలైనంత త్వరగా చర్యలు తీసుకొని, ఆ స్థలాన్ని కాపాడుతారని ఆశిస్తున్నాం.

- అఫ్జల్ బాబా, స్థానికుడు

వెబ్ స్టోరీస్