MLA Rajasingh | తెలంగాణ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ఎమ్మెల్యే రాజాసింగ్||

ఈవార్తలు, హైదరాబాద్ న్యూస్: తెలంగాణ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. మార్చి 30వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రలో రాజాసింగ్ చేసిన ప్రసంగం వివాదాస్పదంగా ఉందంటూ అఫ్జల్‌గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే.. శ్రీరామనవమి సందర్భంగా దూల్ పేటలోని ఆకాశ్‌పూరి హనుమాన్ మందిర్‌లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీరామ శోభాయాత్రను ప్రారంభించారు. ఈ ర్యాలీలో పెద్దఎత్తున యువకులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన కొడుకును పరిచయం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రాబోయే రోజుల్లో భారతదేశం అఖండ హిందూ దేశంగా ఆవిర్భవించబోతోంది. దీన్ని ఎవరూ ఆపలేరు. భారత దేశం నుంచి విడిపోవాలనుకొనే ముస్లింలు పాకిస్థాన్, బంగ్లాదేశ్ తదితర ఇస్లాం దేశాలకు పోవచ్చు. బెంగాల్, కేరళతో పాటు మరిన్ని రాష్ట్రాలు ఇస్లామిక్ రాష్ట్రాలుగా ఏర్పడే అవకాశం ఉంది. హిందువులు జాగ్రత్త పడాలి’ అని వ్యాఖ్యానించారు.

‘ప్రధాని మోదీకి మనమంతా సహకరించాలి. భారత్ రాజధాని ఢిల్లీ కాదు. అయోధ్య, కాశీ, మదురై ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. లవ్ జీహాద్ అనేవాళ్లను దేశం నుంచి తరిమికొడతాం. దేశం హిందూ దేశంగా మారితే గోహత్యలు జరగవు. సాధువులకు భారత్ రక్షణగా నిలుస్తుంది. అఖండ భారత్ సిద్ధించే వరకు హిందువులు నిరంతరం పోరాటం చేస్తుండాలి’ అని పిలుపునిచ్చారు. దీనిపై అఫ్జల్‌గంజ్ ఎస్సై వీరబాబు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, రాజాసింగ్‌పై ఐపీసీ సెక్షన్లు 153-ఏ, 506 కింద నమోదు నమోదు చేశారు.

కాగా, పీడీయాక్ట్ కేసులో  జైలుకు వెళ్లి ఈమధ్యే విడుదలైన రాజాసింగ్‌కు తెలంగాణ హైకోర్టు.. విద్వేష పూరిత వ్యాఖ్యలు చేయొద్దని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తాజాగా ఆ ఆదేశాలను ఉల్లంఘించేలా రాజాసింగ్ మాట్లాడారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు నోటీసులు ఇచ్చి, వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను కోరారు.

వెబ్ స్టోరీస్