బెల్లంపల్లిలో షాదీఖానా స్థలం కబ్జా.. పట్టించుకోని మున్సిపల్ కమిషనర్.. కాంట్రాక్టర్ సైలెంట్

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||కబ్జాకు గురైన బెల్లంపల్లి షాదీఖానా||

ఈవార్తలు, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో షాదీఖానా స్థలం రాబందుల పాలవుతోంది. పట్టణంలోని షంషీర్ నగర్‌లో ముస్లిం వర్గానికి కేటాయించిన షాదీఖానా స్థలాన్ని కొందరు తమ అంగబలాన్ని ఉపయోగించి కబ్జాకు పాల్పడుతున్నారు. దొంగ రెవెన్యూ పత్రాలు సృష్టించి కోర్టులనే తప్పుదారి పట్టించేస్థాయికి చేరారు. ఈ కబ్జాపై అధికారులకు ఎన్నిసార్లు వినతులు చేసినా చలనం లేకపోవడం గమనార్హం. ఇటీవలే బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వోలను కలిసి ఆ వర్గానికి చెందిన పెద్ద మనుషులు షాదీఖానా స్థలాన్ని కాపాడాలని వినతి పత్రం అందజేశారు. అయినా, అధికారులు చీమ కుట్టినట్టు కూడా స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

కాగా, రాష్ట్ర ప్రభుత్వం షాదీఖానా కోసం స్థలం కేటాయించి, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నిర్మాణం కోసం రూ.50 లక్షలు మంజూరు చేశారు. ఈ మధ్యే కాంట్రాక్టర్ కూడా పనులు మొదలుపెట్టారు. కానీ, షాదీఖానా స్థలంలో కబ్జా అయిన ప్రాంతాన్ని విడిచిపెట్టి మిగతా ప్రాంతాన్ని మాత్రమే చదును చేయడం చూస్తే ఈ కబ్జాలో పెద్దల హస్తం ఉందన్న అనుమానం కలుగుతోంది. తనకెందుకు వచ్చి బాధ అనుకొని కాంట్రాక్టర్ కూడా సెలెంట్‌గా ఉండిపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకొని, కబ్జాకోరుల నుంచి షాదీఖానా స్థలాన్ని కాపాడాలని ముస్లిం వర్గ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫిర్యాదుపై అలసత్వం వహించిన మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వోపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వెబ్ స్టోరీస్