Narayana College | నారాయణ కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

రంగారెడ్డి, ఈవార్తలు, క్రైం న్యూస్: అధిక సమయం చదవాలని అధికంగా మార్కులు తెచ్చుకోవాలని కళాశాల యాజమాన్యం ఒత్తిడి భరించలేక ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి బల్వన్మరణానికి పాల్పడ్డాడు. తన మరణానికి కాలేజీ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ ఇతర అధ్యాపకులే కారణమని కోరుకుంటూ సూసైడ్ నోట్ కూడా రాశాడు. వివరాల్లోకి వెళితే మహేశ్వరం నియోజకవర్గ మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెల్లగూడ గౌతమ్‌నగర్‌కు చెందిన మంచెల ఆనంద్ పాల వ్యాపారి. ఆయన ఇద్దరు కుమారులలో పెద్దవాడైన వైభవ్ (16)  నారాయణ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కొంతకాలంగా వైభవ్‌పై ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, అధ్యాపకులు బాగా చదవాలని, ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో వైభవ్ మంగళవారం ఉదయం తండ్రితో పాటు వెళ్లి పలు కాలనీలలో పాల ప్యాకెట్లు సరఫరా చేసి ఇంటికి వచ్చాడు. అనంతరం బెడ్ రూమ్ లోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

తన చావుకు కాలేజీ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఇతర అధ్యాపకుల వేధింపులే కారణమని చెబుతూ వైభవ్ రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన తమ్ముడిని తాను చదువుతున్న కార్పొరేట్ కాలేజీలో చదివించవద్దని, మంచి కాలేజీలో చేర్పించాలని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. కాగా వైభవ్ ఆత్మహత్యకు కారణమైన కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు మీర్‌పేట పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. సూసైడ్ నోటు ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.

వెబ్ స్టోరీస్