కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది ఏపీ వాసులు దుర్మరణం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దారుణ ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు. ఆగి ఉన్న ట్యాంకర్‌ను టాటా సుమో ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఏపీకి చెందినవారే. ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల నుంచి బెంగళూరు వెళ్తున్న టాటా సుమో వాహనం గురువారం ఉదయం 7 గంటలకు చిక్‌బళ్లాపూర్ శివారులోని జాతీయ రహదారి 44పై ఆగి ఉన్న ట్యాంకర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి దగ్గరలోని దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయాడు. 

పొగమంచు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పొగ మంచు వల్ల రోడ్డు సరిగా కనిపించక ఈ ఘోరం జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు చిక్‌బళ్లాపూర్ పోలీసులు వెల్లడించారు. మృతుల్లో 9 మంది పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారని, వీరంతా వలస కూలీలని తెలిపారు. ప్రమాద ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం అందజేస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు.

వెబ్ స్టోరీస్