ఎందుకూ పనికిరాని ఐక్యరాజ్యసమితి.. భారత్ లాంటి దేశాలపైనే దీని ఏడుపంతా.. ఇంకా అవసరమా?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడంలో ఐక్యరాజ్యసమితి ప్రభావవంతంగా పనిచేసిందా? లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్-పాలస్తీనా(హమాస్) మధ్య యుద్ధాన్ని ఆపుతున్నదా? లేదు. అలాంటప్పుడు ఈ ఐక్యరాజ్యసమితి ఎందుకు? అంటే.. ఎందుకూ పనికిరాదంటున్నారు నిపుణులు. ఐక్యరాజ్యసమితిని ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం ఏర్పాటు చేశారు.  1945 ఫిబ్రవరిలో యాల్టా భేటీలో అమెరికా, బ్రిటన్, రష్యా కలిపి ఒక అంతర్జాతీయ సంస్థను స్థాపించాలని తీర్మానం చేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలో 1945 ఏప్రిల్ 25 - జూన్ 26 మధ్య జరిగిన సమావేశంలో 51 దేశాలు చార్టర్‌పై సంతకాలు చేశాయి. 1945 అక్టోబర్ 24న న్యూయార్క్‌లో లాంఛనంగా ప్రారంభమైంది.

దీని ఆశయాలు ఏమిటంటే.. యుద్ధాలు జరగకుండా చూడడం, అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించటం, దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించటం, అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలు గౌరవించేట్లు చేయటం, సామాజిక అభివృద్ధి సాధించి, మానవ జీవితాలను సుఖవంతం చేయటం. కానీ, వీటిలో వేటినీ సక్రమంగా నిర్వహించినట్లు ఐక్యరాజ్యసమితి చరిత్రలోనే లేవు.

ముఖ్యవిషయం ఏమిటంటే.. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా శాశ్వత సభ్య దేశాలు. ఈ దేశాల్లో అన్నీ ఏదో ఒక యుద్ధంలో పాల్గొన్నవే/యుద్ధంలో ఉన్న దేశాలకు మద్దతు ఇచ్చినవే. అమెరికా పెద్దన్నలా వ్యవహరిస్తున్నా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయకుండా, ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చింది. బ్రిటన్ కూడా ఉక్రెయిన్‌కు మద్దతు తెలిపింది. ఇక రష్యా నేరుగా యుద్ధంలో పాల్గొన్నది. ఎలాగూ రష్యా, చైనా స్నేహితులే కాబట్టి.. చైనా కూడా రష్యా వైపే ఉంది. అంటే.. ప్రపంచ శాంతి నెలకొల్పాల్సిన దేశాలే యుద్ధాన్ని ప్రేరేపిస్తుంటే, ఈ ఐక్యరాజ్యసమితి ఉండి ఎందుకు? అని అంతర్జాతీయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం హమాస్ ఉగ్రవాదులకు, ఇజ్రాయెల్ సైన్యాలకు మధ్య యుద్ధం జరుగుతున్నా, ఒక విధంగా ఇది ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధమే. దీన్ని ఆపడానికి ఏ దేశమూ ప్రయత్నించటం లేదు. వేల మంది సాధారణ ప్రజలు చనిపోతున్నా, హింసను ఆపాలని కోరుతున్న దేశం ఒక్కటీ లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకూ పనికిరాని ఐక్యరాజ్యసమితిని పెట్టుకొని ఏం చేయటం అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ఐక్యరాజ్యసమితి ఏదన్నా ఉద్ధరించిందా? అంటే భారత్ లాంటి దేశాలపై దాని ఏడుపంతా. కశ్మీర్ అంశం, భారత అంతర్గత సమస్యలు తదితరాలపైనే ఏడుస్తుంది. ఆకలి కేకలు అంటూ నివేదికలు విడుదల చేస్తుంది. దానికి ఒక కొలమాణం అంటూ ఏదీ లేదు. అనేక సూచీలను విడుదల చేస్తుంది తప్ప, పెద్దగా చేసిన పనైతే లేదన్న వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో 193 దేశాలు ఉన్నాయి. ఈ సంస్థ ఇప్పటి వరకు సాధించిన గొప్ప పని ఏదన్నా ఉందంటే ఏదీ లేదు. రువాండా, స్రెబ్రెనికాలో మారణహోమాన్ని ఆపలేకపోయింది. దక్షిణ సుడాన్‌లో అంతర్యుద్ధాన్ని ఆపడంలో విఫలమైంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం వైఫల్యం ఐక్యరాజ్యసమితి అసమర్థతను సూచిస్తుంది. శరణార్థులను ఆదుకోవడంలో చేసిన పని అంతంత మాత్రమే. దానికి శాశ్వత పరిష్కారం చూపిన దాఖలాల్లేవు. అయితే, ఐక్యరాజ్యసమితి కోసం భారత్ మాత్రం చాలానే చేస్తోంది. కొరియా, ఈజిప్ట్, కాంగో, హైతీ, అంగోలా, లైబీరియా, సోమాలియా, రువాండా, లెబనాన్ తదితర దేశాలకు ఐక్యరాజ్యసమితి తరఫున భారత్ తన శాంతి పరిరక్షక దళాలను పంపింది.

వెబ్ స్టోరీస్