Motivation | ఆత్మవిశ్వాసం అంటే ఈయనదే.. డ్రైవింగ్‌లో శివలాల్ రికార్డు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



QQ1

||టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో శివలాల్||

(రంగారెడ్డి, ఈవార్తలు, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం ఓడింది అని నిరూపిస్తున్నారు దేశంలోనే మొట్టమొదటిసారిగా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మరుగుజ్జు శివలాల్. అతని జీవితం పడ్డ బాధలు అవమానాలు అనంతర విజయాల గురించి మా ఈవార్తలు పాఠకుల కోసం ప్రత్యేకం. శివలాల్ నేత ప్రస్తుత వయసు 30 సంవత్సరాలు. ఎత్తు 3 అడుగులు. అయినా మొక్కవోని పట్టుదల, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం ఆయన సొంతం. పట్టు వదలని విక్రమార్కుడిలా ఏకంగా రద్దీగా ఉండే హైదరాబాద్ నగర వీధుల్లో జామ్ జామ్ అంటూ కారును అలవోకగా నడుపుతూ అందరినీ అబ్బురపరుస్తున్నారు. కారు నడపడంలో గొప్పేమిటి అని మీరు అడగవచ్చు. కానీ శివలాల్ ఎత్తు కేవలం మూడు అడుగులు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని నిరూపిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో గంగాధర్ రాజమణి దంపతులకు పెద్ద కుమారుడిగా జన్మించారు శివలాల్. శివలాల్‌కు ఇద్దరు తమ్ముళ్లు రాజకుమార్, రాజశేఖర్. ఉన్నత విద్యావంతుడు అయిన శివలాల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీకాం పూర్తిచేసిన మొట్టమొదటి మరుగుజ్జుగా మరో రికార్డు సొంతం చేసుకున్నారు. ఆయనకు ఉన్న ప్రత్యేక అర్హతలు టైప్ రైటింగ్లో హయ్యర్ ఇంగ్లీష్, తెలుగులో ఉత్తీర్ణులయ్యారు. కంప్యూటర్‌లో పీజీ చేసిన శివలాల్ ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కొనసాగుతున్నారు.

పట్టుదల అంటే ఆయనదే..

విధి శివలాల్‌ను ఎక్కిరించినా మొక్కవోని ధైర్యంతో చిన్నతనం నుండి తన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఎదుగుతున్న కొద్దీ ఎన్నో అవమానాలు, మరెన్నో అవరోధాలు.. అవేవీ ఆయన ముందు విజయం సాధించలేదు. పొట్టివాడు అయినా గట్టివాడు అని నిరూపించుకుంటున్నారు. శివలాల్ ఎంత పెద్దవాడు అయినా అతనితో తలదించుకొని మాట్లాడవలసిందే. అతను మాత్రం తలెత్తుకొని చూస్తాడు దట్ ఈజ్ శివలాల్. అతని ముందు ఉన్న లక్ష్యం ఒక్కటే విధిని ఎదిరిస్తూ తనను తాను శక్తివంతునిగా తీర్చిదిద్దుకోవడం. ఆత్మస్థైర్యంలో ముందుకు సాగడం. తన మరుగుజ్జుతనాన్ని మరిచిపోయి కాలంతో పాటు పరిగెత్తి తనేంటో నిరూపించుకుంటున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశంలోనే పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్సు పొంది రికార్డు సాధించారు. బంజారాహిల్స్ గౌరీ శంకర్ కాలనీలో నివాసం ఉంటున్న శివ లాల్ కారు డ్రైవింగ్ నేర్చుకోవాలన్నది చిరకాల వాంఛ. ఇందుకోసం ఆయన నగరంలోని అన్ని డ్రైవింగ్ స్కూల్స్ యజమానులను సంప్రదించారు. నీకు డ్రైవింగ్ ఏమిటి భూమికి మూడు అడుగుల ఎత్తు కూడా లేవు అని అవమానపరిచిన వారే తప్ప ఎవరు డ్రైవింగ్ నేర్పించలేదు. చివరకు తన మిత్రుడు మెకానిక్ ఇస్మాయిల్ సహకారంతో డ్రైవింగ్ నేర్చుకున్నాడు. ఇప్పుడు మాడిఫికేషన్ చేసిన కారులో తన సహచరిణి చిన్మయితో కలిసి రోడ్లపై చాకచక్యంగా డ్రైవింగ్ చేస్తున్నారు. 

వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు

డ్రైవింగ్ లైసెన్సు పొందిన మొదటి వ్యక్తిగా ది వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శివలాల్ పేరు లిఖించుకున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి బింగి నరేందర్ గౌడ్ శివలాల్‌కు ధ్రువీకరణ పత్రాన్ని అందించి ఘనంగా సత్కరించారు.

నా భార్యకు కూడా డ్రైవింగ్ నేర్పిస్తా!

తన భార్య చిన్మయి కూడా తనలాగే మరుగుజ్జు అయినా కుటుంబంలో తనకు ఆమె సహకారం మరువలేని గర్వంగా చెబుతారు శివలాల్. తన భార్యకు కూడా డ్రైవింగ్ నేర్పించి మరో రికార్డ్ సృష్టిస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. తనకు ఒక బాబు ఉన్నాడని, అతనిని ఉన్నత స్థాయికి తీర్చిదిద్ది వారికి మంచి భవిష్యత్తు ఇవ్వడమే తమ లక్ష్యమని తెలిపారు.

QQ1

||భార్య, కుమారుడితో శివలాల్||

సజ్జనార్ తో కారులో ప్రయాణం చేయాలని కోరిక

‘ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్‌తో కారులో ప్రయాణం చేయాలని నా కోరిక. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదిక ద్వారా సజ్జనార్ ను కోరగా ఆయన వెంటనే అంగీకరించడం ఆనందం కలిగిందని, వెంటనే నా కారు తీసుకుని సార్ ఇంటికి వెళ్లి సార్ ను తన పక్కన కూర్చోబెట్టుకొని తన ఇంటి నుండి బస్ భవన్ వరకు తీసుకువచ్చిన నా అనుభూతికి ఆనందానికి అవధులు లేవు’ అని వెల్లడించారు. శివలాల్ డ్రైవింగ్ ను మెచ్చుకున్న సజ్జనార్.. ఆయన ఆత్మవిశ్వాసం పట్టుదలకు ముగ్ధుడై శివలాల్ కు బొకే ఇవ్వడమే కాక శాలువతో ఘనంగా సన్మానించారు. దివ్యాంగులు ఎవరు ఆత్మన్యూనత భావానికి గురికాకుండా ఆత్మస్థైర్యంతో లక్ష్యసాధనకు కృషి చేయాలని సజ్జనార్ సూచించారని శివలాల్ చెప్పారు.

QQ1

||ఓ కార్యక్రమంలో బాలకృష్ణ, బ్రహ్మానందంతో శివలాల్ కుటుంబం||

రాష్ట్ర ప్రభుత్వం స్థలమిస్తే డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేస్తా

తను డ్రైవింగ్ నేర్చుకునేందుకు ఎంతో కష్టపడ్డానని అలాంటి కష్టం మరో దివ్యాంగుడు పడకూడదు అని అందుకోసం డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలని తనకు లక్ష్యంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు ఎక్కడైనా కొంచెం స్థలం కేటాయిస్తే ఆ స్థలంలో డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేసి తనే దగ్గరుండి ఎంతో మందికి డ్రైవింగ్ నేర్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని శివలాల్ అన్నారు. ఆయన కోరిక నెరవేరాలని మనమూ కోరుకుందాం.

వెబ్ స్టోరీస్