సంతానం లేని పేద దంపతులకు గొప్ప శుభవార్త.. తెలంగాణ సర్కారు గొప్ప నిర్ణయం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

ఈవార్తలు, తెలంగాణ న్యూస్: సంతానం లేక ఇబ్బందులు పడుతున్న పేద దంపతుల కోసం తెలంగాణ సర్కారు గొప్ప నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తొలిసారిగా ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ (ఐవీఎఫ్) కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో దీన్ని ఏర్పాటు చేసింది. ఆస్పత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్ర భవనంలోని 5వ అంతస్థులో ఏర్పాటు చేసింది. దీన్ని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీ హాస్పిటల్‌లో ఐవీఎఫ్ సెంటర్‌ను ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందని తెలిపారు. పేట్లబూర్జు, వరంగల్‌ ఎంజీఎం హాస్పిటల్స్‌లోనూ ఐవీఎఫ్‌ సెంటర్లను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఐవీఎఫ్ అనేది పేద దంపతులకు పిరంగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఖరీదైన వైద్యం ఉచితంగా అందుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఎంఎస్‌‌ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, హాస్పిటల్ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు పాల్గొన్నారు.

గాంధీ హాస్పిటల్‌లో రూ.5 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఐవీఎఫ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 2018 నుంచి హాస్పిటల్‌లో ఐయూఐ విధానం ద్వారా సంతాన సాఫల్య కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 200 మంది మహిళలకు సంతానం కలిగింది. ఇప్పుడు ఐవీఎఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో మంది పేద దంపతులకు లాభం కలగనుంది.


వెబ్ స్టోరీస్