Aarogya Sri | ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు||

ఈవార్తలు, తెలంగాణ న్యూస్: ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. లబ్ధిదారులకు త్వరలో డిజిటల్ కార్డులు అందించాలని నిర్ణయించింది. ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన నేపథ్యంలో కొత్తగా కార్డులను జారీ చేయాలని నిర్ణయించినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో మంగళవారం మంత్రి హరీశ్ ఆధ్వర్యంలో బోర్డు సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందించాలని, ఇందుకోసం లబ్ధిదారుల ఈ-కేవైసీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. నిమ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్ ఆడిట్ నిర్వహించాలని స్పష్టం చేశారు. 

రోగులకు బయోమెట్రిక్‌ నిర్వహించటంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్ వేర్ వినియోగించేందుకు అనుమతి జారీ చేశారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ సెక్రటరీ రిజ్వీ, ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సీఈవో విశాలాక్షి, సీఎం ఓఎస్డీ గంగాధర్‌, డీఎంఈ రమేశ్‌‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బోర్డు తీసుకున్న మరిన్ని నిర్ణయాలివీ..

- డయాలసిస్‌ సేవలు అందించేందుకు ఆన్‌లైన్‌ పర్యవేక్షణకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ వినియోగించాలి.

- కరోనా సమయంలో బ్లాక్ ఫంగస్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించినందుకు కోఠి ఈఎన్టీ హాస్పిటల్‌కు రూ.1.30 కోట్ల అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలి.

- కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీల సేవలను వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానలో కూడా అందుబాటులోకి తేవాలి.

వెబ్ స్టోరీస్