నాడు టీడీపీ నేడు బీజేపీ.. బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ప్రజల్లోకి

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||కేంద్ర హోం మంత్రి అమిత్ షా Photo: Twitter||

(రంగారెడ్డి, ఈవార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ ఇస్తున్న హామీ ఇది. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలకు ప్రాతినిథ్యం దక్కాలన్న ఉద్దేశంతో, వారిని రాజకీయంగా బలోపేతం చేయాలన్న దృక్పథంతో బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సరిగ్గా పదేళ్ల క్రితం కూడా బీసీ ముఖ్యమంత్రి నినాదం తెరపైకి వచ్చింది. 2014లో టీడీపీ.. బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసింది. ఆర్ కృష్ణయ్యను తెలుగుదేశం తరఫున బీసీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఎల్బీనగర్ నుంచి ఆయన పోటీ చేసి గెలిచారు కూడా. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిక స్థానాలు గెలుచుకోవడంతో ఆ హామీ సాధ్యం కాలేదు.

అయితే, ప్రస్తుతం అదే నినాదాన్ని బీజేపీ ఎత్తుకొని ప్రజల్లోకి వెళ్తోంది. బీసీ సీఎం హామీ ఇస్తూ ఓట్లు అభ్యర్థిస్తోంది. తాజాగా శుక్రవారం సూర్యాపేటలో జరిగిన భారతీయ జనతా పార్టీ జనగర్జన సభలో అమిత్ షా.. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే వెనకబడిన తరగతులకు సీఎం పదవి ఇస్తానని ప్రకటించారు. ఈ ప్రకటన పార్టీకి కొత్త జోష్ తీసుకొస్తుందని కమలం పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అమిత్ షా చేసిన ప్రకటన తెలంగాణ ప్రజలకు సువర్ణ అవకాశమని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బీసీలను రాజకీయంగా ఎదగనీయడం లేదని ఆరోపించారు. అమిత్ షా ప్రకటనపై భారతీయ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.

వెబ్ స్టోరీస్