కాంగ్రెస్‌కు కలిసొస్తున్న తెలంగాణ సెంటిమెంట్.. ప్రజల్లో సానుభూతి.. కేసీఆర్‌పై వ్యతిరేకత

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియాగాంధీ||

తెలంగాణ తెచ్చింది తెలంగాణ ప్రజలు. ఇదే అంతిమం. ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీయే. వేరే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని పక్కనబెట్టేసేవి. కాంగ్రెస్ కూడా అదే పని చేయొచ్చు. కానీ, సోనియాగాంధీ తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను గుర్తించారు. ఏదో ప్యాషన్ కోసమో చేస్తున్న ఉద్యమం కాదని గ్రహించిన ఆమె.. తెలంగాణ ఏర్పాటు కోసం పార్టీలోని అగ్రనేతల సహాయంతో ముందడుగు వేశారు. తెలంగాణ కోసం కొట్లాడింది కేసీఆరే అని ఎంత చెప్పినా, తెలంగాణ ఏర్పాటు అనేది సోనియా మనసులో ఉంది కాబట్టే ఇది సాధ్యమైంది. నిజమే.. తెలంగాణ ఇస్తే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందని ఆమెకూ తెలుసు. కానీ, ప్రజల సెంటిమెంట్ ముందు తన రాజకీయాలు పక్కనబెట్టారన్నది మాత్రం ఎవరూ కాదనలేని వాస్తవం.

తెలంగాణ రావటానికి సోనియాగాంధీ ఎంత కృషి చేశారన్నది చాలా కొద్ది మందికే తెలుసు. అందులో ఒకరు కేసీఆర్. ఇప్పుడు కాంగ్రెస్‌పై ఎగిరి గంతేస్తున్నారు కానీ.. సోనియాను ఒక్క మాట అనే ధైర్యం లేదంటే, తెలంగాణ తెచ్చేందుకు సోనియా పడ్డ కష్టం, తీసుకొన్న చొరవ కేసీఆర్‌కు తెలుసు కాబట్టి. మైక్ ఉంది కదా అని ఈ మధ్య కేటీఆర్ కాంగ్రెస్‌పైకి, రాహుల్ గాంధీపైకి నోరెత్తుతున్నారు. కానీ, తాను ఆ పదవులు అనుభవించటానికి రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియాగాంధీ అన్న విషయం తెలుసుకోలేకపోతున్నారు. తెలిసినా, స్వార్థ రాజకీయాల ముసుగు వేసుకొని చదరంగం ఆడుతున్నారు.

ఆనాడు తెలంగాణ ఇవ్వాల్సిందేనని ఫిక్స్ అయిన సోనియాగాంధీ.. ఆ గురుతర బాధ్యతను కేంద్ర శాఖలో పనిచేసే ఓ సీనియర్ ఐఏఎస్ అధికారికి అప్పగించారు. ఆ అధికారికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలుసు కనుగ బిల్లును రూపొందించే బాధ్యతలు చేపట్టారు. ఆ విషయం తెలిసిన కేసీఆర్.. ఆయనతో టచ్‌లోకి కూడా వెళ్లి, సోనియా తెలంగాణ తెచ్చేందుకు తీసుకొంటున్న ప్రత్యేక శ్రద్ధను తెలుసుకున్నారు. కానీ, ఆ విషయాన్నీ ఆఫ్ ది రికార్డు. ఇవి ఎప్పటికీ ప్రజలకు కనిపించవు. 2014లో కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేస్తానన్న కేసీఆర్ తర్వాత సోనియాకు హ్యాండ్ ఇచ్చి, ప్రజాక్షేత్రంలోకి వెళ్లి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యారు.

ఈ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, కుటుంబగణం అనుభవించిన పదవులన్నీ సోనియా పెట్టిన భిక్షే. అయితే, ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. తెలంగాణ తేవటానికి కృషి చేసిన కేసీఆర్‌కు ఇన్నేళ్లు పదవులు కట్టబెట్టిన మనం.. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన సోనియాకు బహుమతి ఇవ్వాల్సిన అవసరం ఉందని గ్రహించారు. అందుకే ఎన్నికల కోసం వేచి చూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం కాంగ్రెస్ గాలి వీస్తోంది. ఎలాగైనా హస్తం పార్టీని నిలువరించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, అవి బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు ప్రజలకు నచ్చడం లేదు. ఆ పార్టీ కింది స్థాయి నేతల నుంచి పై స్థాయి నేతల వరకు ప్రతీ ఒక్కరు తమ గర్వాన్ని చూపిస్తున్నారు. ఇది ఎంత మాత్రం సహించలేనిదని ప్రజలు ఫిక్స్ అయ్యారు. అందుకే ఓటుతోనే సమాధానం చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు.

బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలుస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో, ఈ సారి ప్రజల తీర్పు గొప్ప విప్లవానికి నాంది పలకనుంది. అది రాష్ట్ర, దేశ రాజకీయాల్లో కొత్త మార్పునకు స్వాగతం పలుకుతుంది. తెలంగాణ ప్రజలు అదే కోరుకుంటున్నారు. అందుకే ఓటు వేసే సమయం కోసం వేచి చూస్తున్నారు.

(వ్యాసకర్త: వాగర్థ, రాజకీయ విశ్లేషకుడు)

వెబ్ స్టోరీస్