Telangana | కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. తుమ్మల, గద్దర్ కూతురుకు టికెట్ ఖరారు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల||

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన రెండో జాబితాను ప్రకటించింది. తాజాగా, 45 మందితో జాబితాను విడుదల చేసింది. మొత్తంగా 119 అసెంబ్లీ స్థానాలకు గానూ రెండు జాబితాలు కలిపి 100 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మరో 19 సీట్లను పెండింగ్‌లో ఉంచింది. మలి జాబితాలో మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వర్ రావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఖైరతాబాద్ నుంచి విజయారెడ్డికి సీటు కేటాయించింది. జూబ్లీహిల్స్‌లో మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు, గద్దర్ కూతురు వెన్నెలకు కంటోన్మెంట్ టికెట్ ఖరారు చేసింది.

పెండింగ్‌లో ఉన్న 19 స్థానాల్లో నాలుగు స్థానాలు వామపక్షాలకు కేటాయించాలని ఆ పార్టీ నాయకత్వం యోచిస్తోంది. అవికాక, మిగతా 15 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉందన్న మాట. కాంగ్రెస్ ఇంకా ప్రకటించని 19 స్థానాలు ఏవంటే.. వైరా, కొత్తగూడెం, చార్మినార్, మిర్యాలగూడ, చెన్నూరు, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యాపేట, తుంగతుర్తి, బాన్సువాడ, జుక్కల్, పటాన్‌చెరు, కరీంనగర్, ఇల్లెందు, డోర్నకల్, సత్తుపల్లి, అశ్వారావుపేట, నారాయణ్‌ఖేడ్ ఉన్నాయి. కాగా, కొత్తగూడెం, వైరా సీట్లను సీపీఐకి, మిర్యాలగూడ, చెన్నూరు సీట్లను సీపీఎంకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఇక.. సీఎం కేసీఆర్, కేటీఆర్, బీజేపీ నేత బండి సంజయ్ పోటీచేస్తున్న కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్ సీట్లలో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డిని బరిలో నిలిపే చాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

వెబ్ స్టోరీస్