రాజకీయాల్లో పద్మశాలీల చైతన్యం.. సిరిసిల్లలో కేటీఆర్‌కు లగిశెట్టి శ్రీనివాస్ సవాల్

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

\

||లగిశెట్టి శ్రీనివాస్||

తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన కులాల్లో పద్మశాలీలు ఉంటారు. ప్రస్తుతం వీరి చూపు రాజకీయాలపై పడింది. అగ్రకులాల అణచివేత విధానాన్ని ధిక్కరించేందుకు బీసీ కులాల్లోనే ముందుగా పద్మశాలీలు కదం తొక్కారు. అందుకు నిదర్శనం సిరిసిల్లలో లగిశెట్టి శ్రీనివాస్ పోటీయే. ఆయన సిరిసిల్లలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు సిరిసిల్ల నియోజకవర్గంలో 500 మందికిపైగా పేద కుటుంబాలకు పుస్తె, మట్టెలు పంపిణీ చేశారు. పలువురికి ఆర్థిక సహాయం అందించారు. 2009లో లగిశెట్టి శ్రీనివాస్‌ను సిరిసిల్ల ఎమ్మెల్యేగా బరిలో ఉంచాలని పద్మశాలి సంఘం తీర్మానం చేసింది. అయితే, ప్రస్తుత మంత్రి కేటీఆర్‌పై పోటీ వద్దని సన్నిహితులు చెప్పటంతో ఆయన వెనక్కి తగ్గారు. బీఆర్ఎస్‌లో చేరి సెస్ వైస్ చైర్మన్ పదవి చేపట్టారు. అయితే, ఆ పార్టీలో ఉంటే ఎప్పటికీ జీ హుజూర్ అనటమే అని నిర్ధారించుకున్న ఆయన.. బీజేపీలో చేరారు. అక్కడ కూడా పరిస్థితి బాగోలేకపోవటంతో సొంతంగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.

సొంతంగా బరిలోకి దిగితే సరిపోదు.. ప్రజల నుంచి స్పందన రావాలి. అది ఓటు బ్యాంకుగా మారాలి. వాస్తవానికి కేటీఆర్ అంటే పెద్ద స్థాయి నేత. ఆయన మీద పోటీ అంటే మామూలుగా ఉండదు. గెలిస్తే ఒక చరిత్ర అవుతుంది. మరి అలాంటి వ్యక్తిపై పోటీ అంటే.. అందుకు సిద్ధమైన లగిశెట్టి శ్రీనివాస్ తన యుద్ధాన్ని ప్రకటించారు. ప్రజలతోనే తాను తేల్చుకుంటానని బరిలో నిలుచున్నారు. అనుకున్నట్లుగానే ఆయనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నామినేషన్ వేసిన రోజు ఆయన వెంట వచ్చిన ప్రజలను చూస్తే తెలుస్తుంది.. ఆయన బలమేంటో, ఎందుకు కేటీఆర్‌కు దీటుగా బరిలో ఉంటున్నారో. సిరిసిల్ల అంటేనే పద్మశాలీల అడ్డా. అందుకే, పద్మశాలీలంతా ఆయనకు ఏకపక్షంగా మద్దతు తెలుపుతున్నారు. ఆయన వెంట ఉన్న ప్రజలు.. మందు తాగిపిస్తేనో, బిర్యానీ తినిపిస్తేనో వచ్చినవాళ్లు కాదు. ‘పద్మశాలీలకు అధికారం’ అన్న గొప్ప సంకల్పం.

ఆ సంకల్పమే పద్మశాలీల్లో నాటుకుపోయింది. అందుకే లగిశెట్టి శ్రీనివాస్ కోసం తమ సంపూర్ణ మద్దతును తెలుపుతున్నారు. ఇప్పుడు ఈ భయమే కేటీఆర్‌కు పట్టుకుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. 2009 నుంచి పద్మశాలీల మద్దతుతోనే కేటీఆర్ గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు పద్మశాలీల మద్దతు లగిశెట్టికే ఇవ్వటంతో కేటీఆర్ ఓటమి భయంతో ఉన్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా పద్మశాలీల్లో రాజకీయ చైతన్యం రావటం మంచిదేనని, ఇతర బీసీ కులాలకు పద్మశాలీలు ఆదర్శంగా నిలుస్తున్నారని అంటున్నారు.

అటు.. జగిత్యాలలో కూడా భోగ శ్రావణి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆమె కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. వీరిద్దరే కాకుండా పలు చోట్ల పద్మశాలీలు ఎన్నికల బరిలో నిలుచున్నారు. వీరిలో చాలా మందికి ప్రజల నుంచి, పద్మశాలీల నుంచి మద్దతు దక్కుతోంది. ఆ మద్దతు ఓటుగా మారితే చట్టసభల్లో పద్మశాలీల ప్రాతినిథ్యం పెరగనుంది. ఈ రోజు పద్మశాలీలు వేసిన రాజకీయ అడుగులు.. ఇతర కులాలకు బాటగా మారనున్నాయి అన్నది అక్షర సత్యం.

వెబ్ స్టోరీస్