Opinion | బీజేపీపై సన్నగిల్లుతోన్న విశ్వాసం.. తెలంగాణలో పుంజుకుంటున్న కాంగ్రెస్.. కష్టపడితే అధికారం ‘హస్త’గతం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

(ప్రముఖ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం)

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఒక్కొక్కటిగా మారుతున్నాయి. మొన్నటిదాకా అధికార బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనన్న పరిస్థితులు చేంజ్ అవుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకోవడమే ఇందుకు కారణం. అదీకాక బీజేపీలో అంతర్గత పోరు నడుస్తోందన్న వాదనలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌కు ఎదురు లేదనే చెప్పాలి. అధికార పార్టీకి తప్ప.. మిగతా ఏ పార్టీకి కూడా తెలంగాణలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే సరైన అభ్యర్థులు లేరు. ఇది వాస్తవం. అయితే, బీఆర్ఎస్ ప్రజల నుంచి దూరం అవుతోందని క్షేత్రస్థాయి పరిస్థితులు చెప్తున్నాయి. బీఆర్ఎస్ పైస్థాయి నేతలు తప్ప మిగతా నేతలు అవినీతిలో కూరుకుపోవడం, దళితబంధు లాంటి పథకాల్లో కమీషన్లు తీసుకోవడం లాంటి చర్యలు ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. పైగా, పై స్థాయి నేతల నియోజకవర్గాల్లో తప్ప మిగతా నియోజకవర్గాల్లో అభివృద్ధి లేకపోవడం కూడా మరో విషయం. అదీకాక.. కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావు వ్యవహరించిన తీరు ఒంటెత్తు పోకడలను తలపించిందన్న వాదనలూ ఉన్నాయి.

ముఖ్యంగా, ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సమయంలో కేసీఆర్ తీరు పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన వ్యవహారశైలిని ప్రజలు స్వాగతించినా, ఆర్టీసీ కార్మికులు మాత్రం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. కొండగట్టు బస్సు ప్రమాదం లాంటి సందర్భాల్లో ఆయన నేరుగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం కూడా ప్రజల్లో అసంతృప్తికి కారణం అయ్యింది. ఇలాంటి పరిస్థితులు ప్రజల  చూపును ప్రత్యామ్నాయం వైపు తిప్పుతున్నాయి. ఎంతలా అంటే.. మరేవైనా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా, నమ్మకపోయేంత. పైగా, తెలంగాణ రాష్ట్ర సమితి అన్న పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చడాన్ని ఒక వర్గం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ డబ్బునంతా తీసుకెళ్లి మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో వాడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో, కాదో చెప్పే బాధ్యత కచ్చితంగా కేసీఆర్‌పై ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మొన్నటి వరకు సాధారణ ప్రజలు మరో పార్టీ వంక చూశారు.

ఆ పార్టీల్లో బీజేపీ ముందు వరుసలో ఉండేది. అయితే, కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌లో ఉత్సాహాన్ని పెంచింది. పైగా, ప్రజల్లో బీజేపీ సంపాదించుకున్న నమ్మకాన్ని కోల్పోతూ వస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితను అరెస్టు చేస్తారని చెప్తూ వచ్చిన బీజేపీ నేతలు.. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఇక్కడ బీఆర్ఎస్‌కు వత్తాసు పలుకుతోందన్న అపవాదులు ఉన్నాయి. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది. అందుకే, ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మరో ప్రత్యామ్నాయం కూడా లేకపోవడం, తెలంగాణ ఇచ్చిందన్న సానుభూతి ప్రజల్లో పెరగటం ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ పార్టీకి ఒక అవకాశం ఇచ్చి చూడాలన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది. ఇది హస్తం పార్టీకి కలిసివచ్చే అంశం. అయితే, స్థానికంగా నేతలే ఆ పార్టీకి గుదిబండగా మారుతున్నారు. స్థానిక నేతల్లో ఐకమత్యం లేకపోవడం, ఎవరికి వారు సొంతంగా ప్రకటనలు చేయడం, సొంత పార్టీ నేతలపైనే ఆరోపణలు చేయడం వంటి అంశాలు ఆ పార్టీని దెబ్బతీస్తున్నాయి. అందరు కలిసికట్టుగా పోరాడితే, బీఆర్ఎస్‌ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదన్న అభిప్రాయం క్షేత్రస్థాయిలో ఉన్న సాధారణ ప్రజల్లోనూ వ్యక్తం అవుతోంది. ఇందుకు పార్టీ అధిష్ఠానం అందరినీ ఒక్క తాటిపైకి తీసుకురావాలి. అయితే, ఇక్కడ కొందరు నేతలు కేసీఆర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వారే కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారారని విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టి, ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తే హస్తం పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంటుంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆచితూచిగా అడుగులు వేస్తే కాంగ్రెస్‌కు తిరుగు ఉండదు.

- ఈవార్తలు

వెబ్ స్టోరీస్