సిద్దిపేట జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఏకకాలంలో 106 మంది ఉద్యోగులపై వేటు.. ఎందుకంటే..

ఒకరిద్దరు కాదు.. ఏకంగా 106 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్నారన్న కారణంతో వారందరిపై వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

siddipet news
ప్రతీకాత్మక చిత్రం

ఈవార్తలు, సిద్దిపేట న్యూస్: ఒకరిద్దరు కాదు.. ఏకంగా 106 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్నారన్న కారణంతో వారందరిపై వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 7వ తేదీన సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో ఉపాధి హామీ, సెర్ప్ ఉద్యోగులతో మెదక్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి, తదితర నాయకులు సమావేశం నిర్వహించారు. అయితే, ఈ సమావేశానికి అనుమతి తీసుకోలేదన్నది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించిన వీడియో బయటికి రావటంతో పోలీసులు వెంకట్రామిరెడ్డి, రవీందర్‌రెడ్డిపై కేసు నమోదుచేశారు. మరోవైపు, ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులను సీసీటీవీ ఆధారంగా గుర్తించారు. సస్పెండయిన వారిలో 38 మంది సెర్ప్‌ ఉద్యోగులు, 68 మంది ఉపాధిహామీ ఉద్యోగులు ఉన్నారు. కాగా, ఈ సమావేశంపై మెదక్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

వెబ్ స్టోరీస్