Prashant Kishor IPAC | ఐప్యాక్‌కు ప్రశాంత్ కిశోర్ ఎందుకు దూరమయ్యారంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రశాంత్ కిశోర్||

ఈవార్తలు, సోషల్ టాక్: ప్రశాంత్ కిశోర్.. రాజకీయ వ్యూహకర్త. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావటానికి కీ రోల్ ప్లే చేసి, వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత బీహార్‌లో నితీశ్ కోసం, పంజాబ్‌లో అమరీందర్ సింగ్ కోసం, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కోసం, తమిళనాడులో స్టాలిన్ కోసం, పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ కోసం, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ కోసం పనిచేశారు. ఈ రాష్ట్రాల్లో ఆయన పనిచేసిన పార్టీనే అధికారం చేపట్టింది. ఆయన స్థాపించిన సంస్థ ఐప్యాక్ ద్వారానే రాజకీయ వ్యూహరచన జరిగేది. అయితే, తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్, ఐప్యాక్ వేర్వేరా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఐప్యాక్‌ను స్థాపించిందే ప్రశాంత్ కిశోర్ అయితే, ఐప్యాక్ వైసీపీ కోసం పనిచేయటం, ఆయనేమో చంద్రబాబును కలవటం ఏమిటని ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయి.

అయితే, ప్రస్తుతం ఐప్యాక్‌కు, ప్రశాంత్ కిశోర్‌కు ఎలాంటి సంబంధం లేదు. 2019లోనే ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ నుంచి దూరమయ్యారు. రాజకీయాల్లోకి వెళ్లడం కోసం ఆయన ఐప్యాక్ నుంచి దూరం జరిగారు. ప్రస్తుతం ఆయన బీహార్‌లో తన జన్ సూరజ్ మిషన్‌తో బిజీగా ఉన్నారు. అప్పటి నుంచి ఐప్యాక్‌ను రిషి రాజ్ సింగ్ నడుపుతున్నారు. అంటే.. ప్రస్తుతం ఐప్యాక్ రిషి రాజ్ సింగ్‌ది అన్న మాట. ఈయన ప్రశాంత్ కిశోర్ సహోద్యోగి. డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు. ఈయన నేతృత్వంలోనే ఐప్యాక్ వచ్చే ఎన్నికల వరకు వైఎస్ జగన్ పార్టీ కోసం పనిచేస్తుంది.

ఎవరీ రిషి రాజ్ సింగ్?

యూపీకి రిషి రాజ్ సింగ్.. కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివారు. అనంతరం ముంబైలో పెట్టుబడి బ్యాంకర్‌గా మారారు, మంచి జీతం పొందారు. రాజకీయ వ్యూహకర్తగా మారాలని నిర్ణయించుకొని స్నేహితులతో కలిసి 2013లో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (CAG) సంస్థను స్థాపించారు. ఈ సంస్థ 2014 ఎన్నికల కోసం బీజేపీ, మోదీ కోసం ప్రచారం చేసింది. త్రీడీ షోలు, చాయ్ పే చర్చా లాంటి అనేక కార్యక్రమాలను నిర్వహించింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆయన కాగ్‌ను రద్దు చేశారు. ఆ తర్వాత ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్‌లో చేరి ఆయనతో కలిసి పనిచేస్తున్నారు.

వెబ్ స్టోరీస్