BSNL : బీఎస్ఎన్ఎల్ దుస్థితికి కారణం వాళ్లేనా.. డిజిటల్ ఇండియాలో ఎందుకు నిలదొక్కులేకపోతున్నది?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

(Photo: బీఎస్ఎన్ఎల్ లోగో, ప్రతీకాత్మక చిత్రం)

ఈవార్తలు, టెక్ న్యూస్: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్).. దేశ టెలికం రంగంలో దీనిది ప్రత్యేక పాత్ర. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ టెలికం సంస్థ ఇప్పటికీ ప్రజల్లో ఆదరణ కలిగి ఉన్నది. కానీ, ఆ ఆదరణ.. పాపం అనేలా తయారైంది. సింపతీ తప్ప ఇంకేమీ చూపించలేని స్థితికి చేరిందా సంస్థ. ప్రభుత్వ సంస్థను బతికిద్దాం అనుకొనే కొద్ది మంది కూడా.. నెట్‌వర్క్, కాల్, మెసేజ్, ఇంటర్నెట్ సమస్యలతో సతమతమవుతున్నారు. ఏదో అలా నెట్టుకొచ్చేలా తయారైంది. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో తప్ప సాధారణ జనం దాదాపు ఈ టెలికం సంస్థకు దూరమయ్యారు. కాదు.. కాదు.. దూరం చేశారు.

అలా దూరమైన వినియోగదారులు.. ప్రైవేట్ కంపెనీల వైపు తిరిగారు తప్ప మళ్లీ బీఎస్ఎన్ఎల్ ముఖం చూడలేదు. అదే సమయంలో ఈ సంస్థ ప్రాభవం కోల్పోతుంటే ప్రైవేట్ సంస్థలు ఓ వెలుగు వెలుగుతున్నాయి. వినియోగదారుల నుంచి బీఎస్ఎన్ఎల్ దూరం అవుతున్న ప్రారంభంలో వొడాఫోన్, ఐడియా, ఎయిర్‌టెల్ వినియోగదారులు తక్కువే. అప్పుడే టాటా డొకొమో వన్ పైసా వన్ సెకను లాంటి ఆఫర్లు తెచ్చింది. దీంతో ఆ కంపెనీ సిమ్స్ భారీగా అమ్ముడుపోయాయి. ఆ తర్వాత మిగతా కంపెనీలు అదే బాటలోకి వెళ్లాయి. ఒక్క బీఎస్ఎన్ఎల్ తప్ప. దాంతో వినియోగదారులు త్వరగా మారిపోయారు.

అయితే, ఇక్కడ వినియోగదారులను బీఎస్ఎన్ఎల్‌కు దూరం చేయటంలో కీలక పాత్ర ఆ సంస్థ ఉద్యోగులదేనని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. నాడు..  సారూ! సర్వీస్ బాగాలేదని అడిగితే స్పందించిన నాథుడే లేడు. కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తే కలవదు. కలిసినా, సమస్య పరిష్కారం దొరకదు. దొరికినా.. ఏ నెలకో, రెండు నెలలకో అన్నట్లు ఉండేది. పైగా, కొత్త సిమ్ కావాలంటే ఆఫీసుల చుట్టు తిరగాల్సిందే. సిమ్ కోసం ఆస్తి పత్రాలను కూడా చూపించాలన్నట్టు డాక్యుమెంట్లు అడిగేవారు సిబ్బంది. కార్యాలయానికి వెళ్తే.. పట్టించుకోకుండా గంటల తరబడి కూర్చోబెట్టేవారు. జీతం వస్తుంది కదా మాకేంటి అన్నట్లు నాటి ఉద్యోగుల తీరు ఉండేదని ఆనాడు సిమ్ కోసం బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ చుట్టు తిరిగిన ఓ వ్యక్తి తన ఆవేదనను వెల్లడించారు.

బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల తీరు మారకపోగా, ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ సంస్థల వైపు మొగ్గు చూపాయి. స్పెక్ట్రం అమ్మకంలో బీఎస్ఎన్ఎల్‌ను పక్కనబెట్టాయి. ఇలాంటి చర్యలు సంస్థ నిట్టనిలువునా కూలిపోవటానికి కారణమైందని విశ్లేషకులు చెప్తున్నారు. అన్ని ప్రైవేట్ టెలికం సంస్థలు 3జీ నుంచి 4జీకి వేగంగా మారిపోయాయి. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ 3జీ వద్దే ఆగిపోయింది. ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వటంలోనూ తగ్గిపోయింది. మొన్నకి మొన్న 5జీ వస్తే సంస్థలన్నీ ఆర్నెల్లలోపు దేశమంతా 5జీని తీసుకొస్తామని ప్రకటించాయి. కానీ, బీఎస్ఎన్ఎల్ విషయంలో కేంద్రం మాత్రం త్వరలో.. అని చెప్పి చేతులు దులపుకొన్నది. దేశమంతా డిజిటల్ జపం చేస్తున్న ఈ తరుణంలో బీఎస్ఎన్ఎల్‌కు సహకారం అందిస్తే, సంస్థతో పాటు, ఉద్యోగులు కూడా బాగుపడతారు. కానీ, అలాంటి చర్యలేవీ జరగటం లేదని ఆ రంగ నిపుణులు బాధ వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు ఉద్యోగులు సక్రమంగా పనిచేసి ఉంటే, ఈ రోజు సంస్థకు ఈ దుస్థితి వచ్చేదే కాదని పేర్కొంటున్నారు.

వెబ్ స్టోరీస్