ఎన్నికల ప్రచారం కోసం బండి సంజయ్‌కు హెలికాప్టర్.. బీజేపీ బీసీ సీఎం అభ్యర్థి ఆయనే?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||బండి సంజయ్||

తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ వేగవంతం చేసింది. సీట్ల కేటాయింపు పూర్తి కాకముందే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు హెలికాప్టర్ కేటాయించినట్లు తెలిసింది. ఎన్నికల్లో సుడిగాలి పర్యటన కోసం హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీనికోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర పార్టీకి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బండి సంజయ్ పోటీ చేస్తుండగా, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ హోదాలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని సూచించినట్లు తెలిసింది. ప్రతి రోజు రెండు సభల్లో ఆయన పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఏయే నియోజకవర్గాల్లో పాల్గొనాలి? ఎన్ని సభల్లో బండి ప్రసంగం ఉండాలన్న దానిపై ఓ రిపోర్టు తయారు చేస్తున్నట్లు తెలిసింది.

వాస్తవానికి తెలంగాణలో బీజేపీకి బండి సంజయ్ ఫుల్ మైలేజీ తీసుకొచ్చారు. అయితే ఉన్నట్టుండి ఆ పార్టీ అధిష్టానం.. రాష్ట్ర పార్టీ బాధ్యతలను కిషన్ రెడ్డికి అప్పగించింది. దాంతో పార్టీలో చాలా మంది పార్టీ నిర్ణయంపై నిరాశతో ఉన్నారు. బండి అభిమానులైతే ఒకింత అసంతృప్తిని వెళ్లగక్కారు. ఒకానొక సందర్భంలో 2028 ఎన్నికల కోసం ప్రిపేర్ అవుతున్నామా? అని ఆ పార్టీ వర్గాలే చర్చించుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌కు హెలికాప్టర్ కేటాయించడం బీజేపీ ప్రచారం మరో ఎత్తుకు చేరనుందని తెలుస్తోంది.

ప్రస్తుత రాజకీయాల్లో భావోద్వేగాలను తట్టి, ఓట్లు రాబట్టడంలో బండి సంజయ్ దిట్ట. ఆయన దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో అలాగే సక్సెస్ అయ్యారు కూడా. జీహెచ్ఎంసీ ఎన్నికలైతే బండి రాజకీయ కెరీర్‌లో హైలైట్. అధికార బీఆర్ఎస్‌కు ముచ్చెమటలు పట్టించారు. ఇప్పుడు తేరుకున్న పార్టీ అధిష్టానం.. బండిని సరిగ్గా వాడుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే ఆయనకు హెలికాప్టర్ కేటాయించినట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు. పైగా, ఆ మధ్య రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీసీ సీఎం అని ప్రకటించారు. దాంతో బండి సంజయ్ పేరు తెర మీదికి వచ్చింది. ఈటల పేరు వినిపించినా, ఆరెస్సెస్ బ్యాగ్రౌండ్ లేకపోవడం ఆయనకు మైనస్ అని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ పేరును ముందుకుతెచ్చి.. అంటే బీసీ సీఎం అభ్యర్థిగా ప్రకటించి, మళ్లీ పార్టీని బరిలో నిలిపే చర్యగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హెలికాప్టర్ కేటాయింపు అందులోభాగమేనని చెప్తున్నారు.

వెబ్ స్టోరీస్