సునామీలా విరుచుకుపడ్డ అజింక్యా రహానే.. ముంబైని చిత్తుచేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||అజింక్య రహానే Photo: twitter||

ఈవార్తలు స్పోర్ట్స్‌ న్యూస్‌: మొనగాళ్ల పోరులో ధోనీ సేనను విజయం వరించింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌లో మొదట ముంబైని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన చెన్నై.. ఆనక బ్యాటింగ్‌లో అదరగొట్టింది. టెస్టు ప్లేయర్‌గా ముద్రపడ్డ రహానే వీరవిహారం చేయడంతో చెన్నై రెండో విజయం నమోదు చేసుకుంది. ఇటీవలి కాలంలో పెద్దగా లైమ్‌ లైట్‌లో లేని రహానే.. శనివారం పూనకం వచ్చినట్లు రెచ్చిపోయాడు. బౌండ్రీలు కొట్టడమే తన లక్ష్యమన్నట్లు.. ముంబై బౌలర్లపై యుద్ధం ప్రకటించడంతో చెన్నై స్కోరు బోర్డు రాకెట్‌ను తలపించింది. ఫలితంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో అత్యంత విజయవంతమైన జౖట్టెన ముంబైపై చెన్నై సూపర్‌ కింగ్స్‌ పైచేయి సాధించింది. డబుల్‌హెడర్‌లో భాగంగా శనివారం రెండో పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (32; 5 ఫోర్లు), టిమ్‌ డేవిడ్‌ (31; ఒక ఫోర్‌, 2 సిక్సర్లు), తిలక్‌ వర్మ (22), రోహిత్‌ శర్మ (21) తలా కొన్ని పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 3 తుషార్‌ దేశ్‌పాండే, మిషెల్‌ శాంట్నర్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో చెన్నై 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. అజింక్యా రహానే (27 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సునామీలా విరుచుకుపడగా.. రుతురాజ్‌ గైక్వాడ్‌ (40 నాటౌట్‌; 2 ఫోర్లు, ఒక సిక్సర్‌), శివమ్‌ దూబే (28; 2 ఫోర్లు, ఒక సిక్సర్‌), అంబటి రాయుడు (20 నాటౌట్‌; 3 ఫోర్లు) రాణించారు. ముంబై బౌలర్లలో బెహ్రన్‌డార్ఫ్‌, పియూష్‌ చావ్లా, కుమార్‌ కార్తికేయ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. జడేజాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా ఆదివారం జరుగనున్న డబుల్‌ హెడర్‌లో గుజరాత్‌తో కోలక్‌తా, పంజాబ్‌తో హైదరాబాద్‌ తలపడనున్నాయి. 

రహానే రఫ్ఫాట..

ఓ మాదిరి లక్ష్యఛేదన తొలి ఓవర్‌లో కాన్వే ఔట్‌ కావడంతో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రహానే వాంఖడే స్టేడియంలో పరుగుల వరద పారించాడు. బెహ్రన్‌డార్ఫ్‌ ఓవర్‌లో సిక్సర్‌తో దంచుడు ప్రారంభించిన రహానే క్రీజులో ఉన్నంతసేపు అదే దూకుడు కొనసాగించాడు. అర్శద్‌ వేసిన నాలుగో ఓవర్లో 6,4,4,4,4 దంచిన రహనే.. పియూష్‌ చావ్లా బౌలింగ్‌లో మరో రెండు ఫోర్లతో 19 బంతుల్లో అర్ధశతకం నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్‌16వ సీజన్‌లో ఇదే ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ కావడం గమనార్హం. జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చిన అనంతరం రహానే ఔటైనా.. మిగిలినవాళ్లంతా బాధ్యతాయుతంగా ఆడటంతో చెన్నై మరో 11 బంతులు మిగిలుండగానే విజయ తీరాలకు చేరింది. అంతకుముందు ముంబై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌కు మంచి ఆరంభం లభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోగా.. భారీ ధర పెట్టి కొనుగోలు చేసుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ (12) ఎక్కువసేపు నిలువలేకపోయాడు. టీ20ల్లో ప్రపంచ నంబర్‌వన్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (1)విఫలమవడం ముంబైకి భారీ దెబ్బక్టొటింది.

వెబ్ స్టోరీస్