DC vs MI | ఢిల్లీకి వరుసగా నాలుగో ఓటమి.. బోణీ కొట్టిన రోహిత్‌ సేన

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||రోహిత్ శర్మ Photo: Twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జౖట్టెన ముంబై ఇండియన్స్‌ తాజా సీజన్‌లో బోణీ కొట్టింది. గత రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన రోహిత్‌ సేన.. ఢిల్లీతో పోరులో సమిష్టిగా సత్తాచాటింది. వెటరన్‌ స్పిన్నర్‌ పియూష్‌ చావ్లా, బెహ్రన్‌డార్ఫ్‌ ధాటికి ఢిల్లీ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. డేవిడ్‌ వార్నర్‌ తనకు అలవాటైన శైలిలో నిధానంగా అర్ధశతకం నమోదు చేసుకోగా.. అక్షర్‌ పటేల్‌ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఛేదనలో కెప్టెన్‌ రోహిత్‌తో పాటు తెలంగాణ ప్లేయర్‌ తిలక్‌ వర్మ రాణించడంతో ముంబై గెలుపు గీత దాటింది. మంగళవారం జరిగిన పోరులో ముంబై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిట్స్‌ను చిత్తుచేసింది. తాజా సీజన్‌లో ఢిల్లీకి ఇది వరుసగా నాలుగో ఓటమి. మొదట ఢిల్లీ 19.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. వార్నర్‌ (47 బంతుల్లో 51; 6 ఫోర్లు), అక్షర్‌ పటేల్‌ (25 బంతుల్లో 54; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించారు. ముంబై బౌలర్లలో పియూష్‌ చావ్లా, జాసెన్‌ బెహ్రన్‌డార్ఫ్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. లక్ష్యఛేదనలో ముంబై 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 రన్స్‌ చేసింది. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ (45 బంతుల్లో 65; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చక్కటి అర్ధశతకం బాదగా.. ఇషాన్‌ కిషన్‌ (31; 6 ఫోర్లు), తిలక్‌ వర్మ (28 బంతుల్లో 41; ఒక ఫోర్‌, 4 సిక్సర్లు) రాణించారు. ఆఖర్లో కామెరూన్‌ గ్రీన్‌ (17 నాటౌట్‌), టిమ్‌ డేవిడ్‌ (13 నాటౌట్‌) ఒత్తిడిని జయిస్తూ జట్టును గెలిపించారు. రోహిత్‌ శర్మకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.  

అక్షర్‌ మెరుపులు.. 

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి మంచి ఆరంభం లభించింది. గత మ్యాచ్‌ల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన ఓపెనర్‌ పృథ్వీ షా (15; 3 ఫోర్లు) ఉన్నంతసేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. మరో ఎండ్‌లో వార్నర్‌ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో ఢిల్లీ సులువుగా పరుగులు రాబట్టింది. ఈ సమయంలో పృథ్వీ ఔట్‌ కాగా.. మనీశ్‌ పాండే (26; 5 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. ముంబై స్పిన్నర్లు పట్టుబిగించగా.. ఢిల్లీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. పాండేతో పాటు అండర్‌-19 ప్రపంచకప్‌ హీరో, అరంగేట్ర ఆటగాడు యష్‌ ధుల్‌ (2), రావ్‌మన్‌ పావెల్‌ (4), లలిత్‌ యాదవ్‌ (2) విఫలమవడంతో క్యాపిటల్స్‌ 98/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్‌ వార్నర్‌కు జత కలిసిన అక్షర్‌ బాదుడే పరమావధిగా రెచ్చిపోయాడు. షోకీన్‌ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టిన అక్షర్‌.. గ్రీన్‌ ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు. బెహ్రన్‌డార్ఫ్‌కు రెండు సిక్సర్లు, మెరిడిత్‌కు 4,6 రుచి చూపించిన ఈ ఆల్‌రౌండర్‌ 22 బంతుల్లో అర్ధశతకం నమోదు చేసుకున్నాడు. అప్పటికే వార్నర్‌ కూడా ఫిఫ్టీ పూర్తవడంతో ఢిల్లీ మరింత స్కోరు చేసేలా కనిపించింది. అయితే 19వ ఓవర్లో ఢిల్లీకి అనుకోని షాక్‌ తగిలింది. మెహ్రన్‌డార్ప్‌ వేసిన ఆ ఓవర్లో ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయింది. ఫుల్‌ జోష్‌లో ఉన్న అక్షర్‌ తొలి బంతికి క్యాచ్‌ ఔట్‌ కాగా.. వార్నర్‌ అతడిని అనుసరించాడు. కుల్దీప్‌ (0) రనౌట్‌ కాగా.. చివరి బంతికి అభిషేక్‌ పొరెల్‌ (1) కూడా వెనుదిరిగాడు. 

* గత సీజన్‌లో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసుకోకపోవడంతో కామెంటేటర్‌ అవతారం ఎత్తిన పియూష్‌ చావ్లా.. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి తనలో ఇంకా చేవ తగ్గలేదని నిరూపించుకున్నాడు. 

* అక్షర్‌ పటేల్‌ కొట్టిన బంతిని అందుకునే క్రమంలో కంటికి గాయమైన సూర్యకుమార్‌ యాదవ్‌.. బ్యాటింగ్‌లో మరోసారి విఫలమయ్యాడు. క్రీజులో అడుగుపెట్టిందే తడవు భారీ షాట్‌ కొట్టేందుకు ప్రయత్నించి గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు.

వెబ్ స్టోరీస్