ఎదురులేని హార్దిక్‌ సేన.. ఐపీఎల్లో రెండో విజయం.. సొంతగడ్డపై ఢిల్లీకి పరాభవం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||గుజరాత్‌కు రెండో విజయం Photo: twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌గా ఐపీఎల్లో అడుగుపెట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ వరుస విజయాలతో విజృంభిస్తున్నది. సీజన్‌ ఆరంభ పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను చిత్తు చేసిన హార్దిక్‌ సేన.. మలి పోరులో ఢిల్లీపై గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. మొదట బౌలర్లు సమిష్టిగా సత్తాచాటడంతో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు పరిమితం చేసిన గుజరాత్‌.. ఆనక ఓ మాదిరి లక్ష్యాన్ని మరో 11 బంతులు మిగిలుండగానే ఛేదించింది. గాయం నుంచి కోలుకుంటున్న రిషబ్‌ పంత్‌ ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించగా.. సొంతగడ్డపై ఢిల్లీ తొలి మ్యాచ్‌లో పరాజయం మూటగట్టుకుంది. మంగళవారం జరిగిన పోరులో గుజరాత్‌ టైటాన్స్‌ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (37; 7 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా.. సర్ఫరాజ్‌ ఖాన్‌ (30), అభిషేక్‌ పొరెల్‌ (20) పర్వాలేదనిపించారు. ఆఖర్లో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ (22 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో ఢిల్లీ పోరాడే స్కోరు చేయగలిగింది. గుజరాత్‌ బౌలర్లలో మహమ్మద్‌ షమీ, రషీద్‌ ఖాన్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. అల్జారీ జోసెఫ్‌ రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్‌ 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 163 పరుగులు చేసింది. యువ ఆటగాడు సాయి సుదర్శన్‌ (48 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ధశతకం సాధించగా.. విజయ్‌ శంకర్‌ (29), డేవిడ్‌ మిల్లర్‌ (16 బంతుల్లో 31 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు.

 వార్నర్‌ స్లో ఇన్నింగ్స్‌..

 మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీకి శుభారంభం దక్కలేదు. యువ ఓపెనర్‌ పృథ్వీషా (7) మూడో ఓవర్‌లోనే పెవిలియన్‌ చేరగా.. మిషెల్‌ మార్ష్‌ (4) అతడిని అనుసరించాడు. ఈ రెండు వికెట్లు షమీ ఖాతాలో చేరాయి. ఈ దశలో సర్ఫరాజ్‌ ఖాన్‌ అండతో కెప్టెన్‌ వార్నర్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వార్నర్‌ అడపా దడపా బౌండ్రీలు కొట్టినా.. సర్ఫరాజ్‌ రన్స్‌ రాబట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఇక కుదురుకున్నట్లే అనుకుంటున్న దశలో అల్జారీ జోసెఫ్‌ ఢిల్లీని దెబ్బతీశాడు. వరుస బంతుల్లో వార్నర్‌తో పాటు రొసో (0)ను ఔట్‌ చేశాడు.  మిడిల్‌ ఓవర్స్‌లో రషీద్‌ ఖాన్‌ ధాటికి ఢిల్లీ పరుగులు చేయలేకపోయింది. ఆఖర్లో అక్షర్‌ బ్యాట్‌కు పనిచెప్పడంతో ఢిల్లీ ఓ మాదిరి స్కోరు చేయగలిగింది. ఛేదనలో గుజరాత్‌కు కూడా మంచి ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు వృద్ధిమాన్‌ సాహా, శుభ్‌మన్‌ గిల్‌ చెరో 14 పరుగులు చేసి పెవిలియన్‌ చేరగా.. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (5) నిరాశ పరిచాడు. దక్షిణాఫ్రికా పేస్‌ గన్‌ అన్రిచ్‌ నోర్జే నిప్పులు చెరిగే బంతులతో చెలరేగాడు. అయితే వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సాయి సుదర్శన్‌ చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు దిగిన విజయ్‌ శంకర్‌తో కలిసి సుదర్శన్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. డేవిడ్‌ మిల్లర్‌ రాకతో మ్యాచ్‌ స్వరూపం మారిపోయింది. మిల్లర్‌, సుదర్శన్‌ వరుస బౌండ్రీలు బాదడంతో గుజరాత్‌ అలవోకగా గెలిచింది. 

స్టాండ్స్‌లో రిషబ్‌ పంత్‌.. 

గుజరాత్‌, ఢిల్లీ మధ్య జరిగిన పోరుకు ఓ ప్రత్యేక అతిథి విచ్చేశాడు. నిరుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ మాజీ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాడు. మోకాలికి సర్జరీ జరగడంతో కాలుకు కట్టుతో కనిపించిన పంత్‌.. తమ జట్టు ఆటగాళ్లలో జోష్‌ నింపాడు. స్టాండ్స్‌ నుంచి మ్యాచ్‌ను వీక్షించిన పంత్‌తో బీసీసీఐ కార్యదర్శి జై షా సహా ఇతర బోర్డు సభ్యులు కాసేపు ముచ్చటించారు.

వెబ్ స్టోరీస్