CSK vs RR | అటు టాపార్డర్‌.. ఇటు స్పిన్‌ ట్రియో.. మరి ఆధిక్యం ఎవరిదో?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||సంజు శాంసన్, ధోనీ Photo: Twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: సొంతగడ్డపై తిరుగులేని ఫామ్‌ కనబరుస్తున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే).. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా ఈ రోజు రాజస్థాన్‌ రాయల్స్‌తో అమీతుమీకి రెడీ అయింది. పేపర్‌ మీద చూసుకుంటే ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నా.. చెన్నైలో ఆడనుండటం సీఎస్కేకు కలిసొచ్చే అవకాశం ఉంది. యశస్వి జైస్వాల్‌, జోస్‌ బట్లర్‌ మంచి టచ్‌లో ఉండటం రాజస్థాన్‌కు కలిసిరానుంది. వీరిద్దరూ చెరో రెండు అర్ధశతకాలతో మంచి టచ్‌లో ఉండగా.. సంజూ శాంసన్‌, రియాన్‌ పరాగ్‌, షిమ్రాన్‌ హెట్‌మైర్‌, ధ్రువ్‌ జొరెల్‌, జాసెన్‌ హోల్డర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే రాజస్థాన్‌ ఈ లీగ్‌లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లన్నీ బ్యాటింగ్‌ వికెట్‌లపైనే ఆడటంతో వారి టాపార్డర్‌ చక్కటి ప్రదర్శన కనబర్చింది. దీంతో ఆ జట్టు మూడింట రెండు విజయాలు ఖాతాలో వేసుకుంది. తొలి సారి చెన్నై చెపాక్‌ స్టేడియంలో బరిలోకి దిగనున్న రాయల్స్‌కు.. చెన్నై స్పిన్నర్ల నుంచి ముప్పు పొంచి ఉంది. ప్రధానంగా జడేజా, శాంట్నర్‌, మోయిన్‌ అలీ చెపాక్‌లో విజృంభించే అవకాశాలున్నాయి. కాగా.. రాజస్థాన్‌కు కూడా నాణ్యమైన స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. రవిచంద్రన్‌ అశ్విన్‌, మురుగన్‌ అశ్విన్‌, యుజ్వేంద్ర చాహల్‌ రూపంలో ముగ్గురు స్పిన్నర్లు రాయల్స్‌ వద్ద ఉండగా.. చెన్నైలో ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న అశ్విన్‌ మరోసారి కీలకం కానున్నాడు. 

చెన్నైకి గాయాల బెడద..

అనారోగ్య కారణాలతో గత మ్యాచ్‌కు దూరమైన ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మోయిన్‌ అలీ తిరిగి జట్టులో చేరనుండటం చెన్నైకి కలిసొచ్చే విషయం కాగా.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌, పేసర్‌ దీపక్‌ చాహర్‌ గాయాల కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయారు. యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఫుల్‌ ఫామ్‌లో ఉండగా.. న్యూజిలాండ్‌ ప్లేయర్‌ కాన్వే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. టెస్టు ప్లేయర్‌ అజింక్యా రహానే గత మ్యాచ్‌లో వీరంగం సృష్టించడం చెన్నై అభిమానుల్లో జోష్‌ నింపింది. క్రీజులో అడుగుపెట్టిందే తడువు.. ప్రత్యర్థి బౌలర్లపై యుద్ధం ప్రకటించిన రహానే.. అదే జోరు కొనసాగించాలని చెన్నై యాజమాన్యం ఆశిస్తున్నది. అంబటి రాయుడు, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్రసింగ్‌ ధోనీ, ప్రిటోరియస్‌తో మిడిలార్డర్‌ బలంగా ఉంది. అయితే సొంతగడ్డపై వీరు సమిష్టిగా రాణించాల్సిన అవసరముంది. స్పిన్‌ విభాగంలో చెన్నైకి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. పేస్‌లో అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పరుగులకంటే ఎక్స్‌ట్రాలే ఎక్కువ ఇస్తున్న తుషార్‌ దేశ్‌పాండే, సిమర్‌జీత్‌ సింగ్‌, సిసండా మగలా ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. 

తుది జట్లు (అంచనా)

చెన్నై: ధోనీ (కెప్టెన్‌), కాన్వే, గైక్వాడ్‌, రహానే/మోయిన్‌ అలీ, శివమ్‌ దూబే, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ప్రిటోరియస్‌, శాంట్నర్‌, తీక్షణ, తుషార్‌ దేశ్‌పాండే.

రాజస్థాన్‌: శాంసన్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, జోస్‌ బట్లర్‌, రియాన్‌ పరాగ్‌, హెట్‌మైర్‌, ధ్రువ్‌ జొరెల్‌, జాసెన్‌ హోల్డర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, మురుగన్‌ అశ్విన్‌, బౌల్ట్‌, చాహల్‌.

వెబ్ స్టోరీస్