సిక్సర్ల హోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్.. కీలక పోరుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||సన్‌రైజర్స్ కెప్టెన్ మార్క్‌రమ్ Photo: Twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అమీతుమీకి సిద్ధమైంది. సీజన్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఏమ్రాతం ప్రభావం చూపలేక పరాజయాలు ఎదుర్కొన్న హైదరాబాద్‌.. ఉప్పల్‌ వేదికగా జరిగిన తమ చివరి మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై గెలిచి బోణీ కొట్టిన విషయం తెలిసిందే. పెద్దగా అంచనాలు లేని ఆటగాళ్లే దంచికొట్టడంతో గత రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన నైట్‌రైడర్స్‌.. అదే ఊపులో హ్యాట్రిక్‌ నమోదు చేసుకోవాలని భావిస్తోంది. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన పోరులో ఆఖరి ఐదు బంతుల్లో విజయానికి 28 పరుగులు అవసరమైన దశలో ఐదు సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించిన రింకూ సింగ్‌పై కోల్‌కతా భారీ ఆశలు పెట్టుకోగా.. అంతకుముందు మ్యాచ్‌లో టాపార్డర్‌ విఫలమైన చోట శార్దూల్‌ ఠాకూర్‌ దంచికొట్టాడు. వీరిద్దరితో పాటు రహ్మానుల్లా, జగదీశన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, రస్సెల్‌, నరైన్‌తో కోల్‌కతా బ్యాటింగ్‌ పటిష్టంగా కనిపిస్తోంది. కేకేఆర్‌ను సొంతగడ్డపై ఎదుర్కోవడం రైజర్స్‌కు శక్తికి మించిన పనిలాగే కనిపిస్తోంది. బ్యాటింగ్‌తో పోల్చుకుంటే బౌలింగ్‌లో సన్‌రైజర్స్‌ బలంగా కనిపిస్తుండగా.. కోల్‌కతా బ్యాటింగ్‌ లైనప్‌ హిట్టర్లతో దట్టంగా ఉంది. రహ్మానుల్లా గుర్బాజ్‌ రూపంలో కోల్‌కతాకు స్థిరమైన ఓపెనర్‌ లభించగా.. ఈ మ్యాచ్‌లో అతడితో పాటు జాసెన్‌ రాయ్‌, లిటన్‌ దాస్‌లో ఒకరు ఓపెనింగ్‌ చేసే చాన్స్‌ ఉంది. అయితే బారీ అశలు పెట్టుకున్న మిస్సైల్‌ మ్యాన్‌ రస్సెల్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం రైడర్స్‌ను ఇబ్బంది పెడుతోంది. హైదరాబాద్‌తో పోరులో రస్సెల్‌ ఫామ్‌లోకి రావాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది.

సమిష్టిగా కదంతొక్కితేనే..!

తొలి రెండు మ్యాచ్‌ల్లో మిడిలార్డర్‌లో వచ్చి విఫలమైన హ్యరీ బ్రూక్‌.. పంజాబ్‌తో పోరులో ఓపెనర్‌గా బరిలోకి దిగినా ఆకట్టుకోలేకపోయాడు. మయాంక్‌ అగర్వాల్‌ మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతుంటే.. మంచి జోష్‌లో ఉన్న అబ్దుల్‌ సమదకు తగినన్ని బంతులు లభించడం లేదు. అతడిని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కాస్త ముందు పంపితే జట్టు స్కోరు మరింత పెరిగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో రాహుల్‌ త్రిపాఠి రాణించగా.. కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ ఫర్వాలేదనిపించాడు. వీరితో పాటు హెన్రిచ్‌ క్లాసెన్‌, అబ్దుల్‌ సమద్‌, వాషింగ్టన్‌ సుందర్‌ సమిష్టిగా సత్తాచాటాల్సిన అవసరముంది. ఇక పేస్‌ బౌలింగ్‌లో ఎప్పట్లాగే భువనేశ్వర్‌కుమార్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ కీలకం కానుండగా.. మయాంక్‌ మార్కండే, వాషింగ్టన్‌ సుందర్‌ స్పిన్‌ బాధ్యతలు మోయనున్నారు.  

తుది జట్లు (అంచనా)

హైదరాబాద్‌: మార్క్‌రమ్‌ (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, హ్యారీ బ్రూక్‌, రాహుల్‌ త్రిపాఠి, హెన్రిచ్‌ క్లాసెన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, మార్కో జాన్సెన్‌, మయాంక్‌ మార్కండే, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమ్రాన్‌ మాలిక్‌/నటరాజన్‌.

కోల్‌కతా: నితీశ్‌ రాణా (కెప్టెన్‌) రహ్మానుల్లా, జగదీశన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, రస్సెల్‌, రింకూ సింగ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, సునీల్‌ నరైన్‌, లోకీ ఫెర్గూసన్‌, ఉమేశ్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి.

వెబ్ స్టోరీస్