ఐపీఎల్‌కు అసలు సిసలు జోష్‌.. 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టిన రింకూ సింగ్‌.. గుజరాత్‌ను చిత్తుచేసిన కోల్‌కతా

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||గుజరాత్‌పై కోల్‌కతా గెలుపు Photo: Twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: ఇది కదా ఐపీఎల్‌ మ్యాచ్‌ అంటే.. ఇది కదా చివరి ఓవర్‌ ముగింపు అంటే! విజయం ఖాయం అనుకున్న జట్టు పరాజయం పాలవడం.. ఆశలే లేని స్థితిలోని జట్టు అద్వితీయ ప్రదర్శనతో జయకేతనం ఎగరవేయడం వంటి అద్భుత దృశ్యాలకు వేదికైన ఐపీఎల్లో మరో ఉత్కంఠ పోరు అభిమానులకు ఉర్రూతలూగించింది. సప్పగా సాగుతున్న ఐపీఎల్‌ 16వ సీజన్‌కు రింకూ సింగ్‌ ఊపిరిలూదాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ విజయానికి 5 బంతుల్లో 28 పరుగులు అవసరమైన దశలో.. రింకూ విధ్వంసం సృష్టించాడు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండ్రీ దాటించాడు. తానెదుర్కొన్న చివరి ఏడు బంతుల్లో 40 పరుగులు రాబట్టిన ఈ యంగ్‌ ప్లేయర్‌.. గుజరాత్‌ చేతిలో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. రింకూ చేసిన రచ్చ ముందు.. విజయ్‌ శంకర్‌ మెరుపులు, రషీద్‌ ఖాన్‌ హ్యాట్రిక్‌ చిన్నబోయాయి. రింకూ సింగ్‌ (21 బంతుల్లో 48 నాటౌట్‌; ఒక ఫోర్‌, 6 సిక్సర్లు).. సిక్సర్లతో రెచ్చిపోవడంతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం డబుల్‌ హెడర్‌లో భాగంగా జరిగిన తొలి పోరులో కోల్‌కతా 3 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌పై విజయం సాధించింది. 

మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ (24 బంతుల్లో 63 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అదిరిపోయే అర్ధశతకం నమోదు చేసుకోగా.. సాయి సుదర్శన్‌ (38 బంతుల్లో 53; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. కోల్‌కతా బౌలర్లలో సునీల్‌ నరైన్‌ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (40 బంతుల్లో 83; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) యాంకర్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. కెప్టెన్‌ నితీశ్‌ రాణా (29 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. అయితే కోల్‌కతాను గెలిపించింది మాత్రం రింకూ సింగ్‌ సునామీ ఇన్నింగ్సే. గుజరాత్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ హ్యాట్రిక్‌ నమోదు చేసుకున్నాడు. రింకూ సింగ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

భారీ లక్ష్యఛేదనలో కోల్‌కతా ఆరంభం నుంచి ఆకట్టుకున్నా.. 17వ ఓవర్లో గుజరాత్‌ స్టాండిన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. వరుస బంతుల్లో మిస్సైల్‌ మ్యాన్‌ రస్సెల్‌ (0)తో పాటు సునీల్‌ నరైన్‌ (0), శార్దూల్‌ ఠాకూర్‌ (0)ను ఔట్‌ చేయడంతో నైట్‌ రైడర్స్‌ పరాజయం ఖాయమనిపించింది. అయితే అక్కడే అద్భుతం ఆవిష్కృతమైంది. 19 ఓవర్‌ చివరి రెండు బంతులకు 6,4 కొట్టిన రింకూ.. యష్‌ దయాల్‌ వేసిన చివరి ఓవర్లో అరాచకానికి అర్ధం మార్చాడు. తొలి బంతికి ఉమేశ్‌ యాదవ్‌ సింగిల్‌ తీసి ఇవ్వగా.. అక్కడి నుంచి వరుసగా ఐదు బంతులను అతడు సిక్సర్లుగా మలిచి కోల్‌కతాను గెలిపించాడు.

వెబ్ స్టోరీస్