పూరన్‌కు పూనకాలు.. చిన్నస్వామిలో పరుగుల జడివాన.. ఉత్కంఠ పోరులో లక్నో చేతిలో ఆర్సీబీ చిత్తు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||లక్నో ఉత్కంఠభరిత విజయం Photo: Twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: టెన్షన్‌తో నరాలు తెగిపోయేంత ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను విజయం వరించింది. చివరి ఓవర్‌ వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో మొదట బెంగళూరు ముగ్గురు మొనగాళ్లు విరాట్‌ కోహ్లీ, డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌ అర్ధశతకాలతో దంచికొట్టడంతో బెంగళూరు భారీ స్కోరు చేయగా.. ఆ తర్వాత స్టొయినిస్‌, పూరన్‌ అరాచకం సృష్టించారు. చిన్న బౌండ్రీలు ఉన్న చిన్నస్వామి స్టేడియంలో పూరన్‌ పూనకం వచ్చినట్లు రెచ్చిపోయాడు. సిక్సర్లు కొట్టడం ఇంత సులువా అన్నట్లు చెలరేగిపోయిన పూరన్‌ ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ నమోదు చేసుకోగా.. లక్నో మూడో విజయం ఖాతాలో వేసుకుంది. సోమవారం జరిగిన పోరులో లక్నో ఒక వికెట్‌ తేడాతో బెంగళూరును చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.

విరాట్‌ కోహ్లీ (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు),  డుప్లెసిస్‌ (46 బంతుల్లో 79 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్‌ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. లక్నో బౌలర్లలో అమిత్‌ మిశ్రా, మార్క్‌వుడ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లక్నో సరిగ్గా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. మార్కస్‌ స్టొయినిస్‌ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), నికోలస్‌ పూరన్‌ (19 బంతుల్లో 62; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. బెంగళూరు బౌలర్లలో సిరాజ్‌, పార్నెల్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. లీగ్‌లో భాగంగా మంగళవారం జరుగనున్న మ్యాచ్‌లో ఢిల్లీతో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది.

ముగ్గురు మొనగాళ్లు..

మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరుకు శుభారంభం దక్కింది. అవేశ్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో 6,4తో దంచుడు ప్రారంభించిన కోహ్లీ.. అతడి మరుసటి ఓవర్‌లో మరో రెండు ఫోర్లు బాదాడు. కృనాల్‌ ఓవర్‌లో సిక్సర్‌ అరుసుకున్న విరాట్‌.. మార్క్‌వుడ్‌కు 4,6తో స్వాగతం పలికాడు. ఫలితంగా పవర్‌ ప్లే ముగిసేసరికి బెంగళూరు 55/0తో నిలిచింది. స్పిన్నర్ల రాకతో స్కోరు వేగం తగ్గగా.. కోహ్లీ 35 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కృనాల్‌ ఓవర్‌లో 6,4 కొట్టిన అనంతరం కోహ్లీ ఔట్‌ కాగా.. మ్యాక్స్‌వెల్‌ రాకతో మ్యాచ్‌ గమనం మారిపోయింది.  కొండంత లక్ష్యఛేదనలో లక్నో టాపార్డర్‌ విఫలమైనా.. మిడిలార్డర్‌ విజృంభించింది. తొలి ఓవర్‌ మూడో బంతికే విధ్వంసక ఆటగాడు మయేర్స్‌ను సిరాజ్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. పార్నెల్‌ వేసిన నాలుగో ఓవర్‌లో హుడా, కృనాల్‌ కూడా వెనుదిరగడంతో పవర్‌ప్లే (6 ఓవర్లు) ముగిసే సరికి లక్నో 37/3తో నిలిచింది.

క్రీజులో కుదురుకున్న రాహుల్‌ పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బందిపడగా.. మరో ఎండ్‌లో స్టొయినిస్‌ భారీ షాట్లతో మైదానాన్ని హోరెత్తించాడు. హర్షల్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌లో 6,4,4 కొట్టిన అతడు.. కరణ్‌ శర్మ బౌలింగ్‌లో సేమ్‌ సీన్‌ రిపీట్‌ చేశాడు. షాబాజ్‌ ఓవర్లో రెండు సిక్సర్లతో 25 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాలుగు బంతుల వ్యవధిలో స్టొయినిస్‌తో పాటు రాహుల్‌ను ఔట్‌ చేసిన ఆర్సీబీ తిరిగి పుంజుకునే ప్రయత్నం చేయగా.. పూరన్‌ వచ్చీరావడంతోనే బెంగళూరు బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. కరణ్‌ శర్మ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు దంచిన పూరన్‌.. హర్షల్‌కు 6,4,6 రుచి చూపించాడు. పార్నెల్‌ బౌలింగ్‌లో 4,6,4తో 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో ఇదే వేగవంతమైన హాఫ్‌సెంచరీ కావడం విశేషం.

వెబ్ స్టోరీస్