అభిమానుల అండతోనే ప్రపంచ చాంపియన్‌గా ఎదిగా: నిఖత్‌ జరీన్‌

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||నిఖత్ జరీన్||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: సొంతగడ్డపై అభిమానుల ప్రోత్సాహం మధ్య బరిలోకి దిగి ప్రపంచ చాంపియన్‌గా నిలువడం చాలా ఆనందంగా ఉందని బాక్సింగ్‌ విశ్వ విజేత నిఖత్‌ జరీన్‌ పేర్కొంది. ఇదే జోరులో ఆసియా గేమ్స్‌తో పాటు వచ్చే ఏడాది జరుగనున్న పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ సత్తాచాటుతానని ధీమా వ్యక్తం చేసింది. దాని కోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు పేర్కొంది. న్యూఢిల్లీ వేదికగా ఇటీవల జరిగిన ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి హైదరాబాద్‌కు విచ్చేసిన నిఖత్‌ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాకు సార్థకత చేకూరుస్తూ స్వదేశంలో జరిగిన మెగాటోర్నీలో ప్రత్యర్థులను నిఖత్‌ మట్టికరిపించి తన పంచ్‌ పవర్‌కు తిరుగలేదని చాటిచెప్పింది. సోమవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిఖత్‌ ముచ్చటించింది.

పారిస్‌లో పతకమే లక్ష్యం

ఎన్ని పతకాలు నెగ్గిన ఒలింపిక్స్‌లో మెడల్‌ గెలిస్తే వచ్చే సంతృప్తే వేరని నిఖత్‌ చెప్పింది. దానికోసం ఇప్పటి నుంచే ప్రణాళికా బద్దంగా శిక్షణ ప్రారంభించినట్లు వెల్లడించింది. ‘వచ్చే ఏడాది పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో ఎలాగైనా పతకం సాధించాలన్న పట్టుదలతో ఉన్నా. అందుకనే విశ్వక్రీడల్లో పతకాన్ని ముద్దాడాలన్న లక్ష్యంతో బరువు కేటగిరీ కూడా మారాను. ఇందుకోసం శరీర బరువు తగ్గించుకునేందుకు కష్టపడాల్సి వచ్చింది. ఓవైపు ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతూనే టెక్నిక్‌ పరంగా మరింత  మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉన్నా. ఇందుకోసం అవసరమైతే విదేశాల్లో శిక్షణ తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తాను’ అని నిఖత్‌ వెల్లడించింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌, దిగ్గజ బాక్సర్‌ మేరీ కోమ్‌ తర్వాత భారత్‌ నుంచి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు నెగ్గిన ఏకైక మహిళా బాక్సర్‌గా రికార్డుల్లోకెక్కిన నిఖత్‌ భవిష్యత్తులోనూ ఇదే జోరు కొనసాగిస్తానని పేర్కొంది. డిఫెండింగ్‌ చాంపియన్‌హోదాను నిలబెట్టుకోవడం ఆనందంగా ఉందన్న నిఖత్‌ దానికోసం చాలా కష్టపడ్డట్లు చెప్పుకొచ్చింది. ‘ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తీవ్రమైన పోటీ నెలకొంది. గత టోర్నీతో పోలిస్తే ఈసారి నేను 52 కేజీలకు బదులు 48-50 విభాగానికి మారాను. దీంతో అన్‌సీడెడ్‌గా పోటీపడాల్సి వచ్చింది.

టోర్నీలో మొత్తం ఆరు బౌట్లలో బరిలోకి దిగాను. బై లభించకపోవడంతో వరుసగా విరామం లేకుండా పోటీకి దిగాల్సి వచ్చింది. అయినా వెరవకుండా.. బౌట్‌ బౌట్‌కు మరింత దూకుడు కనబరిచాను’ అని నిఖత్‌ వివరించింది. ఇటీవల న్యూఢిల్లీ వేదికగా జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌పై నిఖత్‌ స్పందిస్తూ.. ‘వివిధ దేశాలకు చెందిన అగ్రశ్రేణి బాక్సర్లు పాల్గొన్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చాంపియన్‌గా నిలువడం మరిచిపోలేని అనుభూతి. ముఖ్యంగా వరుసగా రెండోసారి పతకం సాధించడం చాలా గర్వంగా ఉంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాను నిలబెట్టుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. దీనికి తోడు స్వదేశంలో అభిమానుల మధ్య టోర్నీ జరుగడంతో సహజంగానే నాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగా రాణించడం కత్తిమీద సామే అనిపించింది. అయితే వారి ప్రోత్సాహంతోనే నా కల నెరవేరింది. వారి అరుపులు నాలో మరింత ఉత్తేజాన్ని నింపాయి. దీంతో ప్రత్యర్థిపై వరుస పంచ్‌లు విసరగలిగా’ అని వివరించింది.

వెబ్ స్టోరీస్