Heart Attack | గుండె పోటును సూచించే 5 లక్షణాలు ఇవే.. కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

ఈవార్తలు, హెల్త్ న్యూస్: మధ్య వయస్కుల నుంచి వృద్ధులకు మాత్రమే వచ్చే వ్యాధిగా ఉండే గుండె పోటు.. ఈ మధ్య యువత, చిన్న పిల్లలను కూడా బలి తీసుకుంటోంది. గుండె లయ తప్పడం, గుండె పోటుకు గురవడం వంటి కారణాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఓ 22 ఏండ్ల వరుడు స్టేజీపై గుండెపోటుతో చనిపోగా, 16 ఏండ్ల పిల్లాడు క్రికెట్‌ ఆడుతూ కుప్పకూలిపోయాడు. ఓ ఐదో తరగతి విద్యార్థిని తరగతి గదిలోనే హార్ట్‌ ఎటాక్‌తో తుది శ్వాస విడిచాడు. కరోనా తర్వాత ఈ తరహా మరణాలు పెరిగిపోయాయి. మరి గుండెపోటుకు ముందు శరీరంలో ఏవైనా సంకేతాలు కనిపిస్తాయా? ఆ సంకేతాలు కనిపించగానే అప్రమత్తమైతే ప్రాణాలను కాపాడుకోవచ్చా? అంటే.. శరీరంలో అకస్మాత్తుగా కలిగే 5 రకాల లక్షణాలను గమనించి ప్రాణాలు కాపాడుకోవచ్చని చెప్తున్నారు. 

గుండెపోటును సూచించే లక్షణాలు

1. ఆందోళన (యాంగ్జైటీ): జీవనశైలి, పని ఒత్తిడి, ట్రాఫిక్‌, గజిబిజి జీవితం వల్ల చాలామందిలో ఆందోళన కామన్‌ అయిపోయింది. ఆందోళన, గుండెపోటు రెండూ ఒకదాని వెనుక ఒకటి కలిసి వస్తాయి. ప్రతి చిన్నవిషయానికి అతిగా ఆందోళన చెందితే అది సడెన్‌ హార్ట్‌ స్టోక్‌కు కారణమవుతుంది. ఇది  గుండె సంబంధిత వ్యాధుల ముప్పును 21 శాతం పెంచుతుంది. 

2. అతిగా చెమటపట్టడం

అతిగా చెమటలు పడుతున్నైట్టెతే తప్పకుండా అప్రమత్తంగా ఉండాల్సిందే. అతిగా చెమట పట్టడం అనేది హార్ట్‌ ఎటాక్‌ రావడానికి సంకేతం. బ్లాక్‌ అయిన మార్గాలగుండా రక్తాన్ని సరఫరా చేసేందుకు గుండె ఎక్కువ పనిచేయాల్సి వచ్చినప్పుడు చెమటలు ఎక్కువ పడుతాయి. ముఖ్యంగా ఎలాంటి శారీరక శ్రమ చేయకున్నా ఓ వ్యక్తికి ఎక్కువ చెమటలు పడుతున్నాయంటే అతడికి కచ్చితంగా గుండెపోటు ముప్పు ఉన్నట్టే. వెంటనే గుండె సంబంధ పరీక్షలు చేయించుకోవాలి.

3. కాళ్లు లాగడం, తిమ్మిర్లు

కాళ్లు లాగడం, పట్టేయడం, తిమ్మిర్లు అనేది మనం సాధారణ సమస్యగా పరిగణిస్తాం. కానీ, ఇది గుండెపోటుకు ప్రధాన సంకేతం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరిఫెరల్‌ ఆర్టరీ డిసీజ్‌ (గుండె నాళాల్లో కొవ్వు, కాల్షియం పేరుకుపోవడం) వల్ల కాళ్ల నొప్పులు వస్తాయి. కాళ్లలోని ధమనులు ఇరుకుగా ఉండడం, ఇందులో కొవ్వు నిల్వలు పేరుకుపోవడంతో ఈ సమస్య వస్తుంది. ఓ వ్యక్తి నడుస్తున్నప్పుడు సడెన్‌గా కాళ్లు పట్టేయడం, తిమ్మిర్లు రావడం, కాళ్లలో జలదరింపులాంటివి గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

4. తీవ్ర అలసట

ఎక్కువ పనిచేస్తే అలసట వస్తుంది. ఒక్కోసారి రాత్రి నిద్ర సరిగ్గా పట్టకున్నా మరుసటి రోజంతా అలసటగా ఉంటుంది. కానీ రోజంతా తీవ్ర అలసట ఉంటే.. అది గుండెపోటుకు సంకేతమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది గుండెపోటుకు అత్యంత కచ్చితమైన లక్షణం కానప్పటికీ అప్రమత్తంగా కావాల్సిందేనని వైద్యులు చెప్తున్నారు. 

5. కడుపు సంబంధ సమస్యలు

గుండె సంబంధ వ్యాధులతో బాధపడేవారు తరుచూ కడపు, జీర్ణ సంబంధ సమస్యలను చవిచూస్తారు. హృదయనాళాల పరిస్థితి మరింత దిగజారడం వల్ల ఇది సంభవిస్తుంది. ఓ వ్యక్తి కడుపు కుడి ఎగువ భాగంలో సడెన్‌గా నొప్పి వస్తే అది కచ్చితంగా గుండెపోటుకు సంకేతం అని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో చాతీ బిగుతుగా మారితే గుండె సంబంధ వైద్యుడిని తప్పకుండా సంపదించాలని చెప్తున్నారు.

వెబ్ స్టోరీస్