చందమామపై లక్షల కోట్ల విలువ చేసే బంగారు గనులు.. ఇంకా అపారమైన ఖనిజ సంపద

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

 

(ప్రతీకాత్మక చిత్రం)

చిన్న పిల్లల మేనమామ చందమామ రాత్రి పూట ఎంత అందంగా కనిపిస్తాడో. పౌర్ణమి నాడు తెల్లగా వెండి వెలుగులతో మిలమిల మెరుస్తూ తన అందాన్ని రెట్టింపు చేసుకుంటాడు. భూమ్మీది నుంచి చూస్తే ఒక చెట్టు, చెట్టు కింద ఒక అవ్వ కూర్చుని ఉన్నట్లు అద్భుతంగా కనిపిస్తాడు. చూస్తుంటే ఒకసారి చందమామ దగ్గరికి పోయి రావాలన్నంత ఉత్సాహం కలుగుతుంది. అయితే, చంద్రుడిపై వెండి వెలుగులు కాదు..  చందమామ నిండా బంగారు గనులు ఉన్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. చంద్రుడి ఒక్క ముక్కను తవ్వినా చాలు.. అపారమైన ఖనిజ సంపద దొరుకుతుందని అంటున్నారు. అక్కడి బంగారం విలువ రూ.కోట్ల కోట్లు ఉంటుందని చెప్తున్నారు. ఒక్క బంగారమే కాదు.. రూ.16 లక్షల కోట్ల విలువైన నీటి సంపద ఉందని తెలిపారు. రూ.11 వేల కోట్ల కోట్ల హీలియం కూడా ఉందని వెల్లడించారు. ఇది పక్కా లెక్క కాదని, అసలు లెక్క చూస్తే అంతకుమించే ఉంటుందని వివరించారు.

చంద్రునిపై విలువైన ఖనిజ సంపదకు కొదవలేదు

స్టోన్ వేర్, సోలార్ ప్యానెళ్లకు వాడే బసాల్ట్, ఐరన్, క్వార్ట్జ్, సిలికాన్‌తో పాటు ప్లాటినం, పల్లాడియం, రోడియం తదితర ఖనిజాలకు కొదవ లేదని పరిశోధకులు పేర్కొన్నారు. వాహనాల ఇంజిన్లు, గ్లాస్, సెరామిక్, ఎలక్ట్రానిక్ పరికరాలు, రాడార్ వ్యవస్థను తయారు చేసే స్కాండియం, యిట్రియం విరివిగా దొరుకుతుందని వెల్లడించారు. భూమి కంటే పది రెట్లు ఎక్కువగా టైటానియం చంద్రునిపై ఉందని తెలిపారు. నాసా ప్రయోగించే ఆర్టెమిస్1 రాకెట్ ద్వారా మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని, భవిష్యత్తులో చంద్రునిపై మైనింగ్ కోసం పలు దేశాలు కొట్లాడుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. రాబోయే దశాబ్దంలో చంద్రునిపై దాదాపు 250 మిషన్స్ చేపట్టే అవకాశాలున్నాయని వెల్లడించారు.

వేల కోట్ల టూరిజం కూడా..

చంద్రునిపై వనరులే కాదు, అక్కడ టూరిజానికి కూడా అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వర్జిన్ గెలాక్టిక్, స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ వంటి సంస్థలు టూరిజంపై ఫోకస్ పెడుతున్నాయని చెప్తున్నారు. 2030 నాటికి స్పేస్ టూరిజం వల్ల 3 బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంటుందని యూబీఎస్ అనే కంపెనీ అంచనా వేసింది. భవిష్యత్తులో పిల్లలు చంద్రునిపైనే జన్మించే అవకాశాలను కొట్టి పారేయలేమని అభిప్రాయపడ్డారు. 2040 నాటికి చంద్రునిపైకి వెళ్లే వారి సంఖ్య 100కు, 2050 నాటికి వెయ్యికి చేరుతుందని జోస్యం చెప్పారు. అక్కడ కూడా రోడ్డు రవాణా వ్యవస్థ, రైల్వే, వ్యాపార సముదాయాలు వెలుస్తాయని వివరించారు.

భూమి, వేరే గ్రహం ఢీకొట్టి చంద్రుడు ఏర్పడ్డాడా?

45 కోట్ల సంవత్సరాల క్రితం మన సౌర వ్యవస్థలోని భూమి, మరో గ్రహం ఢీకొనడం వల్ల చంద్రుడు ఏర్పడ్డాడని చాలా మంది శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. కారణం.. భూమి, చంద్రునిపై ఉండే కొన్ని ఆనవాళ్ల కూర్పు దాదాపు ఒకేలా ఉండటమే. పలు సిద్ధాంతాలను పరిశీలించి శాస్త్రవేత్తలు ఓ అంచనాకు వచ్చారు. 

వెబ్ స్టోరీస్