సెన్సార్ లేని సోషల్ మీడియా వీడియోలు.. అంతా 18+ కంటెంటే.. ప్రభుత్వాల బాధ్యతేది?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

ఈవార్తలు, ఈముచ్చట: ఫేస్‌బుక్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షాట్స్.. ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫాంను తెరిచినా అంతా 18+ కంటెంటే. యువతులు, మహిళలు తమ శరీర భాగాలను ప్రదర్శించే వీడియోలు, లేకపోతే డబుల్ మీనింగ్ డైలాగుల వీడియోలే దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి థియేటర్‌లో ఒక సినిమా చూడటానికి వయసును బట్టి నిబంధనలు ఉంటాయి. సినిమాలో అసభ్యకర సన్నివేశాలు ఉంటే విడుదలకు ముందే దానికి ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేస్తారు. అంటే 18 ఏళ్లు నిండినవాళ్లే ఆ సినిమా చూడాలి. కానీ, ఓటీటీలు, సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో సెన్సార్ షిప్‌ అన్నదే లేకుండా పోయింది. ఎవరు పడితే వాళ్లు ఇష్టమొచ్చిన కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు. దీంతో చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరు ఆ కంటెంట్‌ను వీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీల్లో వచ్చే అశ్లీల సన్నివేశాలు ఇంట్లో పిల్లలతో కలిసి చూసే పరిస్థితి లేదు.

పిల్లలు ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు.. మధ్యలో వచ్చే యాడ్స్ కొన్ని ఓటీటీలకు సంబంధించినవి ఉంటున్నాయి. ఆ వీడియోల్లో దాదాపు అశ్లీలతను చూపించే సన్నివేశాలు ఎక్కువగా ఉండడం గమనార్హం. తల్లిదండ్రులకు అలా ఎదురైన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. దీంతో తల్లిదండ్రులు ఫోన్‌ను లాగేసుకొని, వాటిని తొలగిస్తున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. అలాంటి సమయాల్లో ఏదో ఉంది.. అదేంటి? అన్న అనుమానంతో పిల్లలు వాటిని ఎలాగైనా చూడాలన్న కుతూహలాన్ని ప్రదర్శిస్తున్నారు. పిల్లలు పాడైపోతున్నది అని అనటానికి ఒక ఉదాహరణ మాత్రమే.

‘12 ఏళ్లు కూడా నిండని ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు రీల్స్ చేశారు. ఆ వీడియోను ఓపెన్ చేసి చూడగానే.. బూతులతో రీల్ మొదలైంది. ఇద్దరబ్బాయిల ముందే ఒక అమ్మాయి పచ్చి బూతులు మాట్లాడుతోంది. ఆ వీడియో చూసి షాక్ తిన్నా. పిల్లలు ఏ స్థాయికి దిగజారిపోతున్నారు? వీళ్లా రేపు దేశాన్ని ఉద్ధరించేది? అని అనిపించింది. నిజంగానే.. బూతులు మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది. దీనికి ఏదో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పడాల్సిందే’ అని ఓ మానసిక వైద్య నిపుణుడు తెలిపాడు. పిల్లలపై సోషల్ మీడియా చెడు ప్రభావాన్ని తగ్గించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో బూతుపదాలు సర్వసాధారణంగా మారిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక, పెరిగేకొద్దీ పిల్లలకు సంస్కారం నేర్పాలి. సమాజంలో మహిళలపై జరిగే అకృత్యాల గురించి అవగాహన కల్పించాలి. అలాంటివి జరగకుండా జాగ్రత్త పడేలా చూడాలి. కానీ, ఈ సోషల్ మీడియా, ఓటీటీల వల్ల పిల్లల మెదళ్లు పురుగుపట్టి పోతున్నాయి. పిల్లలంటే.. భావిభారత పౌరులు. వారిని సన్మార్గంలో నడిపించాలి. కానీ, ప్రస్తుతం పరిస్థితి చేయిదాటిపోయింది. ఐదో తరగతి చదివే పిల్లాడు బీర్, విస్కీ తాగుతున్నాడు.. ఎనిమిదో తరగతి అమ్మాయి వక్రమార్గంలో పయనిస్తున్నది.. పదో తరగతి అబ్బాయి డ్రగ్స్ తీసుకుంటున్నాడు.. ఇందుకు తల్లిదండ్రులను నిందించాల్సిందే. వాళ్లే సరిగా పెంచకపోతే, ఇలాంటి దురలవాట్లు ఎందుకు ఏర్పడతాయి? మీ అబ్బాయి ఇలా చేశాడు అంటే.. చేయనీ.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాడు? అని వెనకేసుకొచ్చే తల్లిదండ్రుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోంది.

వెబ్ స్టోరీస్