పాములు గాలిలోని శబ్దాలు వింటాయా? పాల లాంటి ద్రవపదార్థాలు తాగుతాయా? అంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

(రంగారెడ్డి, ఈవార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

ఎవరికైనా గ్రాహక శక్తి ఎక్కువగా ఉంటే.. అరే! వాడివి పాము చెవులు. చిన్నగా మాట్లాడినా వాడికి వినొస్తుంది అని అంటుంటారు. మరి పాములకు చిన్న చిన్న శబ్దాలు వినేంత ఎక్కువ గ్రాహక శక్తి ఉంటుందా? అంటే.. పాముల్లో గాలి ద్వారా ప్రయాణించే పెద్ద తరంగాలను వినే మెకానిజం లేదు. నాదస్వరం వాయిస్తే కూడా దానికి స్పందించవు, నాట్యం చేయవు. నాదస్వరంతో శబ్దం చేయకుండా, దాన్ని ఊదకుండా ఊరికే ఒట్టిగా అటు ఇటు కదిపినా పాము దాన్ని చూస్తూ అటు ఇటు కదులుతూనే ఉంటుంది.

పాముల ఉదర భాగంలో ఉండే సునిశిత నాడుల ద్వారా (భూమి మరియు ఇతర) ఘనపదార్థాల ద్వారా ప్రయాణించే ప్రకంపలను గుర్తించగలుగుతాయి. గాలి ద్వారా ప్రయాణించే శబ్ద తరంగాలను అవి గ్రహించలేవు. అందుకే మనం ఎంత గట్టిగా మాట్లాడినా మన మాటలను పాములు పసిగట్టలేవు. కానీ మనం ఎంత మెల్లగా నడిచినా మన అడుగుల చప్పుడును భూమి ద్వారా ప్రయాణించే ప్రకంపనల ద్వారా గుర్తిస్తాయి. అందుకని పాములు ఎదురైనప్పుడు వాటిని చంపకుండా, కదలకుండా నిలబడితే చాలు. తమకు ఏ ప్రమాదము లేదనుకొని వాటిదారిన వెళ్లిపోతాయి. భూమిపై కొడితే ఆ అలికిడిని ప్రమాద సంకేతంగా భావించి అక్కడి నుంచి మెల్లగా జారుకుంటాయి.

అలాగే, పాములు పాలు (లేదా ఏ ద్రవపదార్థాలను) తాగలేవు. పాలు క్షీరదాలకు మాత్రమే ఆహారం. పాములు పాకే జంతువులు. అంటే అవి సరిసృపాల జాతికి చెందినవి. అందుకే పాములు పాలను జీర్ణించుకోలేవు. వాటిలోని దవడల నిర్మాణం కేవలం ఘన పదార్థాలను పట్టుకొని మింగడానికి ఉపయోగపడతాయి. వాటికి చూపు కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది. పాములకు ఉండే జ్ఞాపకశక్తి కూడా మరీ తక్కువ. కాబట్టి మనుషులను గుర్తించుకొని ఎవరిని పగ పట్టలేవు.

వెబ్ స్టోరీస్